డీఈవో కార్యాలయంలో కొందరు
డైట్‌లో ఫారెన్ సర్వీసులో మరికొందరు
తనిఖీ బృందాల్లో ఇంకొందరు..
ప్రాథమిక బడుల్లో ఉపాధ్యాయులు కరువు
ఆందోళన బాటలో విద్యార్థులు, తల్లిదండ్రులు
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు బడులను బలోపేతం చేస్తున్నామని చెబుతున్న పాలకుల తీరు ఆచరణలో మాత్రం కనిపించడం లేదనే విమర్శలున్నాయి. అసలే ఉపాధ్యాయుల కొరత.. ఆపై డిప్యూటేషన్లు.. ఈ క్రమంలో కొందరు డీఈవో కార్యాలయంలో క్లర్క్, ఇతర పనుల్లో నిమగ్నమవుతుండగా.. మరి కొందరు వారికి కేటాయించిన పాఠశాలను వదిలి ఫారెన్ సర్వీసులో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన గురువులు కొంతమంది వారి సొంత పనులకు ప్రాధాన్యత ఇస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో చేరాలని చెప్పడంతో ప్రైవేట్‌ను వదిలి వస్తే, ఇక్కడ సార్లు లేక నాణ్యమైన విద్య అందడం లేదంటూ తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులను నియమించాలంటూ ఇటీవల జిల్లాలో పలుచోట్ల విద్యార్థులతో కలిసి వారు ఆందోళనలు చేపట్టడం గమనార్హం.
వెక్కిరిస్తున్న ఖాళీల కొరత..
జిల్లాలోని విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. టీచర్లు అవసరం ఉన్న పాఠశాలలకు 213 మందిని సర్దుబాటు చేశారు. ఇంకా చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. 168 పాఠశాలలు ఏకోపాధ్యాయులతోనే కొనసాగుతున్నాయి. 5 తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించడంతో ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
తనిఖీ బృందాల్లో..
ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసేందుకు ఎఫ్‌ఎల్‌ఎన్ బృందాల ను నియమించారు. ప్రాథమిక స్థాయికి సంబంధించి ఐదు, యూపీఎస్, ఉన్నత పాఠశాలలకు ఒక బృందాలను ఏర్పాటు చేశారు. దాదాపు 36 మంది ఇందులో ఉన్నారు. ఉపాధ్యాయుల కొర త కారణంగా కొన్ని జిల్లాల్లో ఈ టీంలను రద్దు చేయగా, జిల్లాలో మాత్రం యథావిఽధిగా కొనసాగిస్తున్నారు. పాఠశాలలను తనిఖీ చేసేందుకు ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం, సెక్టోరల్ అధికారులు ఉండగా, ఎఫ్‌ఎల్‌ఎన్ పేరిట ఈ బృందాలను ఏర్పాటు చేయడంపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై డీ ఈవో మాధవిని ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్ర యత్నించగా, ఆమె అందుబాటులోకి రాలేదు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
కేటాయించిన బడుల్లో చదువు చెప్పకుండా కొందరు డీఈవో కార్యాలయంలో తిష్ట వేస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ప్రస్తుతం ముగ్గురు ఫారెన్ సర్వీస్‌లో ఉండగా, మరో ఇద్దరు డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. అలాగే టెక్ట్స్‌బుక్ మేనేజర్, ఆయనకు మరో ఉపాధ్యాయుడు అసిస్టెంట్, జీసీడీఓ, ఏఎంవో, ఓపెన్ స్కూల్ అసిస్టెంట్ కోఆర్డినేటర్, ఇద్దరు స్టాటస్టికల్ అధికారులుగా పనిచేస్తున్నారు. వీరితో పాటు డైట్ కళాశాలలో ఛాత్రోపాధ్యాయులకు బోధించేందుకు ఐదుగురు ఫారెన్ సర్వీస్‌లో ఇటీవల నియామకం కాగా, మరో ముగ్గురు డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. అలాగే మరికొంత మంది స్పోర్ట్స్ స్కూల్‌లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. అసలే ఉపాధ్యాయుల కొరత ఉండగా, డిప్యూటేషన్లపై ఉండడంతో విద్యార్థుల చదువులు కుంటుపడుతున్నాయి. వారు పనిచేస్తున్న పాఠశాలలు దూర ప్రాంతాల్లో ఉండడంతో జిల్లా కేంద్రంలోనే ఉండేందుకు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం సాగుతోంది. మొత్తం 50 మందికి పైగా బోధనకు బదులు ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు.


