● అంగడిబజార్‌గా ఆసుపత్రి ప్రాంగణం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ప్రైవేట్ వ్యాపారానికి అడ్డాగా మారింది. వివిధ రకాల షాపులతో అంగడిబజార్‌ను తలపిస్తోంది. అనుమతి తీరు ఒకలా.. వ్యాపారం తీరు మరోలా సాగిస్తున్నారు. సర్కారు దవాఖానాలో ప్రైవేట్ మందుల విక్రయాలు చేపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిమ్స్‌లో మూడు, సూపర్ స్పెషాలిటీలో ఒకటి చొప్పున మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రుల్లో పనిచేసే కొంత మంది సిబ్బంది ఈ వ్యాపారులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలున్నాయి. మందులు అందుబాటులో ఉన్నప్పటికీ రోగులకు అందించడం లేదని తెలుస్తోంది. దీంతో పేషెంట్లు ప్రైవేట్‌లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి. ఇటీవల జిల్లాకు విచ్చేసిన వైద్యారోగ్యశాఖ మంత్రి, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం. వెంటనే షాపులను తొలగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి రిమ్స్‌ను తనిఖీ చేశారు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న ఓ హోటల్ అపరిశుభ్రంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మూసివేయించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
పది రోజుల్లో షాపులు
తొలగించాల్సిందే..
రిమ్స్ అధికారులు, సిబ్బందితో కలెక్టర్ రాజర్షిషా గురువారం రిమ్స్ ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న మూడు మెడికల్ షాపులు, కొబ్బరి బోండాల దుకాణంతో పాటు విజయ డెయిరీ పార్లర్, హోటళ్లతో పాటు ఇతర షాపులను తొలగించాలని ఆదేశించారు. పది రోజుల్లో అన్నింటిని తొలగించేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌ను ఆదేశించారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌ను వివరణ కోరగా, కలెక్టర్ ఆదేశాల మేరకు ఆస్పత్రి ఆవరణలో ఉన్న దుకాణాలను, మెడికల్ షాపులను తొలగిస్తామని స్పష్టం చేశారు.


