కై లాస్‌నగర్: బల్దియా సొంత గ్యారేజ్ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతుంది. రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పనులు నత్తనడకన సాగుతున్నా యి. కాంట్రాక్టర్ గడిచిన నాలుగు నెలల్లో కేవలం ప్రహరీ పనులకే పరిమితం కావడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఇలాగే కొనసాగితే మరో ఆరు నెలలైనా అందుబాటులోకి రావడం అనుమానమే. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బల్దియా అధికా రులు పట్టించుకోకపోవడంతోనే జాప్యమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉద్దేశమేంటంటే..
మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణకు సంబంధించి ట్రాక్టర్లు, ట్రాలీఆటోలు, నీటి సరఫ రాకు సంబంధించిన ట్రాక్టర్లు, జేసీబీలు, ట్యాంకర్లు వందలాది గా ఉన్నాయి. వీటి నిర్వహణను ప్రైవేట్ గ్యారేజీల్లో చేయిస్తున్నారు. దీంతో ప్రతినెలా బల్ది యా నుంచి లక్షల నిధులు వెచ్చించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అవసరం లేనప్పటికీ ఆయా విభాగాల అధి కారులు, సిబ్బంది ధనార్జనే ధ్యేయంగా తప్పుడు బి ల్లులు సృష్టించి అందినకాడికి దండుకుంటున్నారు. ఇది బల్దియాకు అదనపు భారంగా మారుతోంది. గుర్తించిన మున్సిపల్ కౌన్సిల్ దీనికి చెక్ పెట్టాలని భావించింది. సొంతంగా గ్యారేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్29న జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఇందుకోసం రూ.50లక్షలు కేటాయిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
నెలరోజుల్లోగా అందుబాటులోకి
బల్దియా గ్యారేజీ ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం ప్రహరీ పనులు కొనసాగుతున్నాయి. అవి పూర్తయిన వెంటనే షెడ్ల ఏర్పాటు పనులు ప్రారంభిస్తాం. 15, 20రోజుల్లోగా అన్ని రకాల పనులు పూర్తి చేసేలా కాంట్రాక్టర్‌ను ఆదేశిస్తాం. నెలరోజుల్లోగా కొత్త గ్యారేజీని అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటాం.
– పి.అరుణ్‌కుమార్, మున్సిపల్ ఇంజినీర్
నత్తనడకన పనులు..
పట్టణంలోని 44వ వార్డు పరిధిలోకి వచ్చే సుందరయ్యనగర్‌లోని రక్షిత మంచినీటి స్థలంలో గల మున్సిపల్ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అక్కడ ప్రహరీతో పాటు వాహనాల మరమ్మతులు, సర్వీసింగ్‌కు వీలుగా ప్రత్యేక షెడ్లను నిర్మించాలని నిర్ణయించారు. వాటర్ వాషింగ్ మిషన్ కొనుగోలుతో పాటు ఇద్దరిని ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియమించాలని, అలాగే అవసరమైన సామగ్రి కొనుగోలు చేయాలని తీర్మానించారు. ఇందుకోసం రూ.50లక్షల నిధులను కేటాయిస్తు టెండర్లను ఆహ్వానించారు. జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ వీటిని దక్కించుకున్నారు. అయితే ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. టెండర్ల ప్రక్రియ ముగిసి నాలుగు నెలలవుతున్నా ఇప్పటికి ప్రహరీ పనులే కొనసాగుతున్నాయి. ఇంకా షెడ్ల నిర్మాణంతో పాటు ఇతరత్రా పనులు చేపట్టాల్సి ఉంది.


