అడ్డగోలుగా డివిజన్ల విభజన | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా డివిజన్ల విభజన

Sep 7 2026 12:09 AM | Updated on Sep 7 2026 12:09 AM

నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన డివిజన్ల పునర్విభజన వ్యవహారం అధికార పార్టీ ప్రయోజనాల కోసమే అన్నట్టుగా సాగుతోంది. ఇప్పటి వరకు ఉన్న 54 డివిజన్లను ఏకంగా 72కు పెంచుతూ విడుదల చేసిన ప్రాథమిక డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై ఇటు నగర ప్రజల్లో, అటు ప్రతిపక్షాల పార్టీల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కనీస శాసీ్త్రయ ప్రమాణాలను గాలికొదిలేసి కేవలం అధికార పార్టీకి అనుకూలంగానే సరిహద్దులను గుర్తించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అనాలోచిత నిర్ణయం

జగరబోయే కార్పొరేషన్‌ ఎన్నికల కోసం డివిజన్ల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనాలోచితంగా ఉంది. డివిజన్ల పెంపు 2011 జనాభా ప్రాతిపదికన చేపట్టాలని సూచించింది. కార్పొరేషన్‌ అధికారులు పద్ధతి ప్రకారం కాకుండా కేవలం జనాభా ప్రాతిపదికతో సర్వే నంబర్ల ఆధారంగా సంఖ్యను పెచేలా చేశారు. దీంతో పాతవార్డుల నంబర్లు పోయి కొత్తవి కేటాయించాల్సి రావడం.. అంతేకాకుండా పరిధి కూడా తగ్గిపోయి ఒక వార్డు మరొకదాంట్లో కలవడం వల్ల అంతా గందరగోళంగా మారింది. పున ర్విభజనలో ఎక్కడా భౌగోళిక పరిస్థితులు, ప్రజా సౌకర్యాలను గుర్తించకుండా గాలికొదిలేసి కేవలం డివిజన్లను ముక్కలు చేయడం జరిగింది.

ఇష్టారాజ్యంగా..

వైఎస్సార్‌సీపీకి పట్టున్న డివిజన్లను లక్ష్యంగా చేసుకుని విభజన చేశారనే విమర్శలున్నాయి. ఆ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంక్‌గా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ప్రాంతాలను ఇష్టారీతిన అడ్డగోలుగా ముక్కలు చేసి సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించారు. 2011 జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేశామంటూనే అధికార పార్టీకి అనుకూలంగా వార్డులను ఏర్పాటు చేయడం వెనుక స్పష్టమైన రాజకీయ దురుద్దేశం కనిపిస్తోంది. అనేక డివిజన్లను ఇష్టారాజ్యంగా చీల్చి పక్క డివిజన్‌లో కలిపినప్పటికీ, కొన్ని డివిజన్లలో జనాభా పెరగడం, మరికొన్నింటిలో తీవ్రంగా తగ్గిపోవడం వంటి అంతు చిక్కని లెక్కలు అధికారుల పనితీరును బట్టబయలు చేస్తున్నాయి.

హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు..

మున్సిపల్‌ ఎన్నికల డీలిమిటేషన్‌పై వైఎస్సార్‌సీపీ సోమవారం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ని ఆశ్రయించనుంది. ఈ ప్రక్రియను సవాల్‌ చేస్తూ ఆ పార్టీ గత జూన్‌ నెలలో రాష్ట్రంలోని వివిధ మున్సిపాల్టీలకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రిట్‌ పిటిషన్‌ నంబర్‌ 16060/2026 ద్వారా నెల్లూరు నగర పాలక సంస్థ డీలిమిటేషన్‌ ప్రక్రియపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ తరపున, అలాగే మరికొందరు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. వాటిని పరిశీలించిన హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ సోమవారం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించనుంది.

అభ్యంతరాలుంటే చెప్పొచ్చు

ప్రస్తుతం డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసిన అధికారులు.. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు ఈనెల 11వ తేదీ వరకు గడువు విధించారు. ప్రతిపాదిత 72 వార్డుల ముసాయిదా సరిహద్దులను శనివారం నుంచి ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. ఎన్‌ఎంసీ కార్యాలయంతోపాటు కలెక్టర్‌, ఆర్డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాల్లోని నోటీస్‌ బోర్డులో వీటిని ఉంచారు. ప్రతిపాదిత వార్డుల పునర్విభజన, సరిహద్దులపై ప్రజలు ఏవైనా సూచనలు, అభ్యంతరాలు ఉంటే అందజేయాలని కమిషనర్‌ నందన్‌ కోరారు. వాటిని పరిశీలించిన అనంతరం తదుపరి ప్రక్రియ చేపడతామన్నారు.

సర్వే నంబర్ల ఆధారంగా వార్డుల

హద్దులతో 72కు పెంపు

అధికార పార్టీకి అనుకూలంగా

వ్యవహరిస్తున్న యంత్రాంగం

నేడు డివిజన్‌ బెంచ్‌ను

ఆశ్రయించనున్న వైఎస్సార్‌సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement