సర్.. నోటీసుల జారీ స్లో!
కై లాస్‌నగర్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా అన్‌మ్యాపింగ్, అనామలిస్ ఓటర్లకు సంబంధించిన నోటీసుల జారీ ప్రక్రి య జిల్లాలో నెమ్మదిగా సాగుతుంది. జిల్లావ్యాప్తంగా 1,50,425మంది ఓటర్లు ఆయా కేటగిరీల్లో ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు వారందరికీ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఆగస్టు నెలాఖ రు వరకే అందజేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అందులో సగం మందికి కూడా ఇవ్వలేదు. నోటీసులు అందుకున్న ఓటర్ల విచారణ కూడా నెమ్మదిగానే సాగుతుంది. ఇలాగే కొనసాగితే గడువులోపు ప్రక్రియ పూర్తికావడం కష్టమే. కాగా ఓటర్ల సౌకర్యార్థం శని, ఆదివారాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు.
నెమ్మదిగా ప్రక్రియ..
సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు జూలైలో ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలు సేకరించారు. 2002 జాబితాతో ప్రస్తుత ఓటర్ల వివరాలు మ్యాపింగ్ కానటువంటి, పేరు, ఇంటిపేరు, డేట్ ఆఫ్ బర్త్, చిరునామా వంటి వివరాలు తప్పుగా ఉన్న వారిని అనామలిస్‌గా గుర్తించారు. ఇలాంటి వారు జిల్లావ్యాప్తంగా 1,50,425 మంది ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇందులో ఆదిలాబాద్ నియోజకవర్గంలోని 295 పోలింగ్ కేంద్రాల పరిధిలో 85,525 మంది అన్‌మ్యాపింగ్, అనామలిస్ ఓటర్లు ఉండగా వీరిలో 8201 మందికి మాత్రమే నోటీసులు జారీ చేశారు. అలాగే బోఽథ్ నియోజకవర్గ పరిధిలోని 305 పోలింగ్ కేంద్రాల పరిధిలో 64,900 మంది ఓటర్లున్నట్లుగా గుర్తించిన అధికారులు వీరిలో 41,754 మందికి నోటీసులు జారీ చేశారు. ఆదిలాబాద్‌తో పోలిస్తే బోథ్‌లో ఈ ప్రక్రియ వేగంగా సాగుతుంది. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలున్నాయి.
విచారణలోనూ తీవ్ర జాప్యం..
నోటీసుల జారీలోనే కాదు ఓటర్ల విచారణ ప్రక్రియలోనూ తీవ్రజాప్యమవుతుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 85,525 మందికి నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 662 మంది విచారణ మాత్రమే పూర్తి కావడం గమనార్హం. ఇక బోథ్‌లో 64,900 మందికి నోటీసులిచ్చి విచారించాల్సి ఉండగా 4,615 మందిని మాత్రమే విచారించినట్లుగా చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎస్‌ఈసీ ప్రకటించిన గడువులోపు ప్రక్రియ పూర్తవడం గగనమే అనిపిస్తోంది.
నేడు, రేపు ప్రత్యేక శిబిరాలు ..
ఓటర్ల సౌకర్యార్థం ఈనెల 5, 6 తేదీల్లో తొలి విడత, 12, 13తేదీల్లో రెండో విడత ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 600 పోలింగ్ కేంద్రాల్లో ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు బీఎల్‌వోలు అందుబాటులో ఉండనున్నారు. ఓట ర్లు నేరుగా తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ముసాయిదా జాబితాలో తమ వివరాలను పరిశీలించుకోవచ్చు. జాబితాలో పేరు లేకుంటే ఫారం–6 ద్వారా ఓటరుగా పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఫారం–7, 8 ద్వారా అభ్యంతరాలు, ఫిర్యాదులు అందజేసే అవకాశం కల్పించనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
పారదర్శక ఓటర్ల జాబితా తయారీలో భా గంగానే ఎస్‌ఈసీ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు బీఎల్‌వో లు ఆయా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. జాబితాలో పేరు లేనటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యంతరా లు, ఫిర్యాదులుంటే కూడా అందించవ చ్చు. బీఎల్‌వోలు వాటిని పరిశీలించి సరిచేసే దిశగా చర్యలు తీసుకుంటారు.నోటీసుల జారీప్రక్రియ వేగవంతం చేసి విచారణ సై తం సత్వరం జరిగేలా చర్యలు తీసుకుంటాం.
– ఎస్.రాజేశ్వర్, అడిషనల్ కలెక్టర్
జిల్లాలో..
పోలింగ్ కేంద్రాలు 600
బీఎల్‌ఓలు 600
మొత్తం ఓటర్లు 4,03,625
నోటీసులను అందుకున్న వారు 48,955
విచారణకు హాజరైన ఓటర్లు 5277


