ఓ ఉన్నతాధికారి అవినీతి బాగోతం
పదోన్నతి, బదిలీపై వెళ్లిన తర్వాత బట్టబయలు
ఆర్‌అండ్‌బీ ఆఫీసర్ నర్సయ్య వ్యవహారం
ప్రాథమికంగా రుజువుకావడంతో సస్పెన్షన్ వేటు
సాక్షి,ఆదిలాబాద్: గత జూలైలో జిల్లాలో ఆర్‌అండ్‌బీ ఈఈగా వ్యవహరిస్తూ పదోన్నతి పొంది నిజామాబాద్ ఎస్‌ఈగా బదిలీపై వెళ్లిన ఎస్.నర్సయ్య అవి నీతి బాగోతం బట్టబయలైంది. జిల్లాలో ఆర్థిక అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో అంతర్గతంగా విజిలెన్స్ విచారణ జరపడం, ప్రాథమికంగా రుజువు కావడంతో సస్పెండ్ వేటు వేశారు. సరిగ్గా ఆయన ఉద్యోగ విరమణ రోజే అంటే.. ఆగస్టు 31న ఆయనపై వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారి నర్సయ్య జిల్లాలో ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్‌గా సుమారు నాలుగేళ్ల పాటు విధులు నిర్వహించారు. మధ్యలో నిర్మల్ జిల్లాలో కూడా కొద్దికాలం ఇన్‌చార్జి ఈఈగా వ్యవహరించా రు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఆయనకు ఈ ప్రాంతంలోని కాంట్రాక్టర్లతో సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఆ శాఖలో ఉంది. దీంతోనే ఆయన ఆర్థిక అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. తాజాగా ఈ విషయం ఆ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది.
టెండర్లలో అవకతవకలు
అధికారి నర్సయ్య జిల్లాలో పనిచేసినకాలంలో ఇక్క డ చేపట్టిన పలు రహదారులు, ప్రభుత్వ భవనాల నిర్మాణ టెండర్లలో నిబంధనలు ఉల్లంఘించి తన కు కావాల్సిన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టేలా ప్ర క్రియను మళ్లించారనే ఆరోపణలున్నాయి. అర్హత లేని, సిండికేట్‌గా మారిన కాంట్రాక్టర్లకు అధిక ప్రాధాన్యతనిస్తూ నిబంధనలు సవరించి మరీ పనులు కట్టబెట్టడం ద్వారా భారీగా కమీషన్లు కుదుర్చుకోవడం జరిగిందనే విమర్శలున్నాయి. రహదారులు, వంతెన నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పా టించకుండానే పనులు పూర్తి చేసినట్లు చూపి, క్షేత్రస్థాయి తనిఖీలు సరిగ్గా నిర్వహించకుండానే కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ బిల్లులు ఆమోదించి నిధుల దు ర్వినియోగానికి సహకరించారని విజిలెన్స్ విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. నాణ్యత ప్రమాణాల తనిఖీ సరిగ్గా చేపట్టకుండానే ఆ పనులకు ఆమోదముద్ర వేసినట్లు చెప్పుకుంటున్నా రు. నాణ్యత పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయ ల బోగస్, అడ్వాన్స్ బిల్లులను కాంట్రాక్టర్లకు మంజూరు చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం.
ఏకంగా నిధులే మళ్లింపు..
ఆర్‌అండ్‌బీ శాఖకు కేటాయించిన అభివృద్ధి నిధుల ను, నిర్వహణ (మెయింటనెన్స్) గ్రాంట్లను నిర్దేశిత పనులకు కాకుండా ఇతర పనుల పేరిట కాగితాల పై రికార్డు చేసి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు విచారణలో ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అనుమతులు లేని పనులను మంజూరు చేయడం, శాఖాపరమైన విచారణలు ఎదుర్కొంటున్న సమయంలోనూ విధానపరమైన నిర్ణయాల్లో అక్రమాలకు పాల్పడినట్లు దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ ఈఈ రమేశ్ పవార్‌ను వివరణ కోరగా, సస్పెన్షన్ వాస్తవమేనని, ప్రస్తుతం తాను స్థానికంగా అందుబాటులో లేనని, శనివారం వివరాలు తెలియజేస్తానని చెప్పారు.


