ప్రాథమిక విద్యాభ్యాసంలో నా గురువు అమరేష్ గణిత బోధన తీరు నన్ను గణితం వైపు ఆకర్షించింది. ఆయన ప్రోత్సాహంతో మ్యాథ్స్‌లో పట్టు సాధించాను. ఇది జేఈఈలో మెరుగైన ర్యాంక్ సాధించేందుకు తోడ్పడింది. మరో గురువు పవన్ ప్రోత్సాహంతో సివిల్స్‌లో టాపర్‌గా నిలిచాను. అమరేష్ సార్‌తో ప్రస్తుతం టచ్‌లో లేనప్పటికీ, పవన్ సార్‌తో అనుబంధం కొనసాగుతుంది. ఆ ఇద్దరిని జీవితాంతం మరిచిపోలేను. విద్యార్థులు సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలంటే తల్లిదండ్రులతో పాటు గురువు పాత్ర ఎంతో కీలకం.
– రాజర్షిషా, కలెక్టర్
మార్గదర్శకులుగా నిలవాలి
ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలి. విద్యార్థి ఎదుగుదలలో టీచర్ల పాత్ర కీలకం. నేను ఈ స్థాయికి ఎదగడానికి మా గురువు జోగిందర్ కృషి ఎంతగానో ఉంది. 9, 10 తరగతుల్లో ఆయన జమ్ములో నాకు విద్యాబుద్ధులు నేర్పించారు. నా జీవితాన్ని తీర్చిదిద్దిన గురువులను ఎన్నటికీ మరిచిపోను. అప్పుడప్పుడు వారితో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకుంటాను. – అఖిల్ మహాజన్, ఎస్పీ
నిస్వార్థ సేవకులు.. గురువులు
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు గురువులు నిస్వార్థంగా సేవ చేస్తారు. అందుకే సమాజంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులు, శాస్త్రవేత్తలందరినీ తీర్చిదిద్దేది టీచర్లే. నా గురువు గంగారెడ్డి పాఠశాలలో ‘నువ్వు పెద్ద లీడర్ అవుతావని..’ ఎప్పుడూ చెప్పేవారు. వారు చేసిన బోధనలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి.
– పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్


