బాసర–సహస్రకుండ్–మాహోర్ ప్రాంతాలను కలుపుతూ ప్రతిపాదన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే 173 కిలోమీటర్ల మార్గాన్ని అభివృద్ధి చేయాలని వినతి ప్రమాదకరంగా ప్రస్తుత మార్గం
ఆచూకీ లేని
భైంసా: చదువుల తల్లి కొలువైన బాసర.. ప్రకృతి అందాల సహస్రకుండ్.. రేణుకామాత, దత్తాత్రేయ క్షేత్రాలతో ప్రసిద్ధి చెందిన మాహోర్.. ఈ మూడు ప్రాంతాలను కలుపుతూ ఆధ్యాత్మిక– పర్యాటక కారిడార్ చేపట్టాలని డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. తెలంగాణలోని బాసర నుంచి మహారాష్ట్రలోని మాహోర్ వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బాసర నుంచి సహస్రకుండ్ జలపాతం వరకు సుమారు 76 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి మాహోర్ వరకు 97 కిలోమీటర్లు ఉండగా మొత్తంగా సుమారు 173 కిలోమీటర్ల మార్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తే తెలంగాణ –మహారాష్ట్ర మధ్య కీలకమైన ఆధ్యాత్మిక –పర్యాటక మార్గంగా ఈ రహదారి మారే అవకాశం ఉంది.
ప్రమాదాల మార్గం..
ప్రస్తుతం ఈ మూడు ప్రాంతాల్లోని ఘాట్ రహదారులు, మలుపులు, రోడ్డు పరిస్థితులు ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతున్నాయి. సోమవారం మాహోర్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న కుభీర్ మండలం పార్డీ (బి) గ్రామానికి చెందిన నలుగురు జీపు ప్రమాదంలో మృతి చెందడం విషాదాన్ని మిగిల్చింది. గతంలో భైంసా మండలం సుంక్లి గ్రామానికి చెందిన ముగ్గురు మాహోర్ నుంచి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈక్రమంలో ఆధ్యాత్మిక –పర్యాటక కారిడార్ నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బాసర –సహస్రకుండ్ –మాహోర్‌ను ఒకే పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తే మూడు ప్రాంతాలకూ ప్రయోజనం కలుగుతుంది. ఇప్పటికే బాసర నుంచి భైంసా వరకు జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. ఇక భైంసా నుంచి మహారాష్ట్ర వైపు రహదారి అనుసంధానాన్ని కొనసాగిస్తూ మాహోర్ దిశగా నిర్మాణం చేపడితే ఈ ప్రాంలాల ముఖచిత్రం మారిపోతుంది. ప్రస్తుతం ఉన్న రహదారులను విస్తరించడం, అవసరమైన చోట కొత్త మార్గాలు నిర్మించడం, ఘాట్ ప్రాంతాల్లో రక్షణ గోడలు, క్రాష్ బ్యారియర్లు, హెచ్చరిక బోర్డులు, పార్కింగ్, అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ప్రయాణం సురక్షితంగా మారుతుంది.
భక్తులకు ఉపయోగకరం..
నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి తీరాన కొలువైన శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం విద్యారంభం, అక్షరాభ్యాసానికి ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్రలోని మాహోర్ రేణుకాదేవి ఆలయం, దత్తాత్రేయ క్షేత్రంతో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగి ఉంది. రేణుకాదేవి ఆలయాన్ని ప్రముఖ శక్తి పీఠాల్లో ఒకటిగా మహారాష్ట్ర పర్యాటక శాఖ పేర్కొంటోంది. వీటి మధ్యలోని సహస్రకుండ్ జలపాతం వర్షాకాలంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మిస్తే భక్తులు ఒకే ప్రయాణంలో ప్రకృతి అందాలు– ఆధ్యాత్మిక అనుభూతి పొందుతారని పలువురు పేర్కొంటున్నారు.
కేంద్ర మంత్రి దృష్టికి..
బాసర–భైంసా జాతీయ రహదారిని మహా రాష్ట్ర వైపు విస్తరించి మాహోర్‌తో అనుసంధా నం చేయాలనే అంశాన్ని ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ పలుమార్లు కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు అందజేశారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కేంద్రానికి సమగ్ర ప్రతిపాదన పంపి తే ఈ మార్గం రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఈ రహదారి నిర్మాణం కేవలం ప్రయాణ సౌకర్యం కోసం చేపట్టే ప్రాజెక్టుగా కాకుండా, రెండు రాష్ట్రాల మధ్య భక్తి, పర్యాటకం, వ్యా పారం, సాంస్కృతిక సంబంధాలను బలోపే తం చేసే మార్గంగా మారుతుంది.


