వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సమాధానం చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సమాధానం చెప్పాలి

Sep 4 2026 11:50 PM | Updated on Sep 4 2026 11:50 PM

నెల్లూరురూరల్‌: చైనాకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అనుచరులు కాదా? అని వైఎస్సార్‌సీపీ నేత, కార్పొరేటర్‌ ఊటుకూరు నాగార్జున ప్రశ్నించారు. వేమిరెడ్డి అనుచరుడిగా చెప్పబడుతున్న డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ ఆ దేశంలో మేయర్‌ హోదాలో స్వాగతాలు అందుకున్నారనే అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం నెల్లూరులో రాజన్న భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేమిరెడ్డి, ఆయన అనుచరులపై అనిల్‌ అసభ్యకరంగా మాట్లాడలేదన్నారు. ఆధారాలతో కొన్ని అంశాలను మాత్రమే ప్రజల ముందుంచారని తెలిపారు. మైనింగ్‌ వ్యవహారంలో ‘డౌవ్‌’ అనే చైనా వ్యక్తి స్థానిక వ్యాపారులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై వేమిరెడ్డి వర్గం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనిల్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కొంతమంది వీపీఆర్‌ అనుచరులు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డిని విమర్శించారని, తాము కూడా అంతకంటే ఘాటుగా మాట్లాడగలమని, అయితే తమకు సంస్కారం ఉందని వ్యాఖ్యానించారు. కార్పొరేషన్‌ ఎన్నికలు సమీపిస్తున్నందుకే వైఎస్సార్‌సీపీ నేతలు ఈ విధంగా మాట్లాడుతున్నారని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబట్టారు. అనిల్‌కు మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. రిజర్వేషన్లు ఖరారు కాకముందే మేయర్‌ అభ్యర్థి విషయంలో మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకున్నారనే అనుమానాలకు తావిచ్చేలా కొందరు ధైర్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 2024 నవంబర్‌లో గిరిజన మహిళ మేయర్‌గా ఉన్న సమయంలో డిప్యూటీ మేయర్‌గా ఉన్న వ్యక్తి చైనాలో మేయర్‌గా చలామణి అయ్యారనే ఆరోపణలపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరారు. ఇది గిరిజనులు, దళితుల పట్ల ఉన్న వివక్షకు ఉదాహరణగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. చైనాకు చెందిన డౌవ్‌తో ఎలాంటి సంబంధం లేదని, ఆ దేశంలో తప్పుడు హోదాలో తిరిగిన ఇద్దరు వ్యక్తులు తన అనుచరులు కాదని వీపీఆర్‌ బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

జగన్‌ పాలనలో సామాజిక న్యాయం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని మేయర్‌గా, బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని మంత్రిగా, గిరిజన మహిళను మేయర్‌గా చేసిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనని నాగార్జున పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన మహిళ మేయర్‌ పట్ల వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందని, నెల్లూరు ప్రజలు ఈ పరిణామాలను గమనించారన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కేవలం జెండాలు మోయడానికేనా? పదవులు అనుభవించేందుకు పనికిరారా? అని మంత్రి నారాయణను ఉద్దేశించి ప్రశ్నించారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు నీలి రాఘవరావు, వేనాటి శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement