నెల్లూరు(బృందావనం): గణేష్ ఉత్సవ సమితి జిల్లా కార్యవర్గ సమావేశం మినీబైపాస్‌రోడ్డు రామమూర్తినగర్‌లోని వారాహి ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు వాయుగుండ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీ పరిధిలో సమితి జిల్లా కమిటీ సభ్యులు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి గణేష్ మండపాల వద్ద, నిమజ్జన ప్రాంతంలో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరాలన్నారు. ఉత్సవాల నిర్వాహకులకు జిల్లాలో ఏ అవసరమొచ్చినా కమిటీ సభ్యులను సంప్రదించితే అందుబాటులో ఉంటారన్నారు. శనివారం ట్రంకురోడ్డు శివాజీ సెంటర్‌లోని టీవీఎస్ కల్యాణసదన్‌లో సింగిల్ విండో అనుమతుల కోసం గణేష్ ఉత్సవ సమితి కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు వెంకటేశ్వర్లు చెప్పారు.
● ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బయ్యా వాసు మాట్లాడుతూ విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ సమితి ఏర్పాటైందన్నారు. గతేడాది ప్రభుత్వపెద్దలతో సంప్రదించి రాష్ట్రంలోని అన్ని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేశామన్నారు. సమితి గౌరవాధ్యక్షుడు పిట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ మండపాల్లో బాలగంగాధర్ తిలక్, ఛత్రపతి శివాజీ మహరాజ్‌ల చిత్రపటాలను పెట్టాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం విజయకుమార్ మాట్లాడుతూ మండపాలకు అవసరమైన జెండాలు, బ్యానర్లు గణేష్ గీతాల డ్రైవ్‌ను అందజేస్తామన్నారు. సమావేశంలో మధుసూదన్‌రెడ్డి, కేవీ మురళీకృష్ణ, వి.హర్షవర్ధన్, ఏవీఆర్ మోహన్‌రావు, టి.భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


