లోకేశ్వరం: మండలంలోని హవర్గ గ్రామానికి చెందిన కౌలు రైతు పోతన్న కరెంటు షాక్‌తో గాయపడ్డాడు. ఎస్సై ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకరంగా.. బరిడే పోతన్న అదే గ్రామానికి చెందిన హవర్గ గ్రామాశివారు ప్రాంతంలోని రేగుంట వెంటకరమణ రైతు వద్ద మూడున్నర ఎకరాల కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. మూడు రోజుల క్రితం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ కాలిపోయింది. దీంతో విద్యుత్ మోటార్లు నడవడం లేదు. శుక్రవారం పొలం వద్దకు వెళ్లిన పోతన్న మోటార్ నడవకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి గమనించాడు. ఫ్యూజ్‌వైర్ లేకపోవడంతో మరో రైతు జాదవ్ మారుతి మన్మద్ గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ లైన్‌మోన్ లక్ష్మణ్‌ను ఎల్‌సీ ఇవ్వమని ఫోన్ చేశాడు. ఎల్‌సీ ఇచ్చారు. పోతన్న ఫ్యూజ్‌వైర్ వేస్తుండా ఒక్కసారి కరెంట్ సరఫరా కావడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. పోతన్న తమ్ముడు బరిడే సురేశ్ ఫిర్యాదు మేరకు విద్యుత్ సబ్ స్టేషన్‌లో పనిచేసే అపరేటర్ మాధవ్, విధులకు గైర్హాజరైన హన్మంత్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
బస్సును ఢీకొని ఒకరికి..
భైంసాటౌన్: బైక్‌పై వెళ్తూ వేగంగా ఆర్టీసీ బస్సును ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకా యవుతి గ్రామానికి చెందిన సంతోష్, సాయినాథ్ బైక్‌పై నిర్మల్‌వైపు నుంచి భైంసావైపు వస్తున్నారు. ఈ క్రమంలో పార్డి(బి) బైపాస్‌రోడ్డు వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న ఆటోను తప్పించబోయి, భైంసా వైపు నుంచి గొల్లమాడ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. ఈ ఘటనలో సంతోష్ కాలు మడమ భాగం నుజ్జునుజ్జయింది. సాయినాథ్‌కు గాయాలయ్యాయి. స్థాని కులు వారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి..
భీమారం: మండల కేంద్రంలోని జాతీయరహదారి పై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమ్ము శశికి తీవ్రగాయాలయ్యాయి. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. శశితో పాటు పోలవేని అభి స్పోర్ట్స్ బైక్‌పై వేగంగా వెళ్లి ఆటో స్టాండ్‌లో ఆటోరిక్షాను, అనంతరం డివైడర్‌ను బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్‌పై వెనుక కూర్చున్న శశి కాలుకు తీవ్ర, ఆటోలో కొత్తపల్లి వెళ్లేందుకు ఉన్న మహిళకు సల్పగాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో శశిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.
బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య
రెబ్బెన: మండలంలోని కిష్టాపూర్‌కు చెందిన బట్టి లస్మక్క(85) అనే వృద్ధురాలు అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెందిన బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టాపూర్‌కు చెందిన లస్మక్క వయస్సు పైబడటంతో కుమారుడైన ధర్మయ్య ఇంటి వద్ద జీవిస్తోంది. లస్మక్క కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రుల్లో చూపిస్తున్నా నయం కాలేదు. అనారోగ్యం విషయంలో తీవ్రంగా ఆలోచిస్తూ కుమిలిపోయేది. గురువారం మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. లస్మక్క కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ఉన్న ఇళ్లతోపాటు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన జుమ్మిడి దేవాజీ నీళ్ల కోసం వెళ్లి బావిలో చూడగా వృద్ధురాలి మృతదేహం కనిపించింది. వెంటనే ఆయన ధర్మయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు బావి వద్దకు వెళ్లి లస్మక్కను గుర్తించారు. మృతురాలి కుమారుడు ధర్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


