బోథ్: మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ చదువుతున్న బాలుడిపై ఉపాధ్యాయురాలు చేయి చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్సై పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. కుచులాపూర్ గ్రామానికి చెందిన ముసుగు నరేందర్‌రెడ్డి, స్వప్న దంపతుల కుమారుడు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. గురువారం తరగతి గదిలో బాలుడిపై ఉపాధ్యాయురాలు సింధూజ చేయిచేసుకుంది. గాయాలతో ఇంటికి చేరిన బాలుడిని గమనించిన తల్లిదండ్రులు బోథ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన ప్రథమ చికిత్స అందించారు. అనంతరం పాఠశాలకు వెళ్లి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, టీచర్ బాలుడిని కొట్టిన దృశ్యాలు కనిపించాయి. దీంతో బాలుడి తల్లి స్వప్న శుక్రవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఉపాధ్యాయురాలితోపాటు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


