కై లాస్‌నగర్: ట్రెజరీలో ఏదైనా బిల్లు పాస్ కావాలంటే ఎంతో కొంత చేయి తడపాల్సిందే. కొన్ని సందర్భాల్లోనైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులకనుగుణంగా పర్సంటేజీల రూపంలో కమీషన్లు ఇవ్వాల్సి వచ్చేది. ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు వంటివారేవరు ఇందుకు మినహాయింపు కాదనేది బహిరంగ రహస్యం. ఇలాంటి అక్రమ వసూళ్లకు ప్రభుత్వం చెక్ పెట్టింది. బిల్లులు పట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే పేపర్‌లెస్ విధానం అమల్లోకి తెచ్చింది. ఆన్‌లైన్‌లో బిల్లులు సమర్పించి నిబంధనల ప్రకారం సరైన డాక్యుమెంట్స్ జతచేస్తే చాలు బిల్లుల చెల్లింపులు వాటంతట అవే జరగనున్నాయి. ఒకవేళ వా టిని తిరస్కరిస్తే అందుకు సంబంధించి స్పష్టమైన కారణం నమోదు చేయాలి. రాష్ట్రస్థాయి నుంచి బి ల్లుల చెల్లింపు ప్రక్రియను పర్యవేక్షిస్తుండటంతో పా రదర్శకత పెరిగి అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది.
హార్డ్‌కాపీలకు స్వస్తి..
ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులు, సిబ్బంది వేతనాలకు సంబంధించి ఆయా శాఖల డీడీఓలు బిల్లులను సిద్ధం చేసి ఆన్‌లైన్‌లో ట్రెజరీకి పంపించేవారు. ఆ బిల్లుల హార్డ్‌కాపీలను సైతం కార్యాలయ ఉద్యోగి ద్వారా ఎస్టీఓలకు పంపించేవారు. వాటిని అక్కడి ఉద్యోగులు పరిశీలించి బిల్లులు చెల్లించేవారు. ఈక్రమంలో బిల్లులను పాస్ చేసేందుకు అక్కడి అధికారులు, ఉద్యోగుల చేయి తడపాల్సి వచ్చేది. బిల్లులు త్వరితగతిన పాస్ కావాలంటే ముడుపులు ముట్టజెప్పాల్సిందే. దీంతో పర్సంటేజీల రూపంలో కమీషన్లు అందజేయాల్సి వచ్చేది. ఇక నుంచి హర్డ్‌కాపీలకు ప్రభుత్వం స్వస్తి పలికింది. ట్రెజరీలో పూర్తిగా ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తూ పేపర్‌లెస్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 15 నుంచి అమల్లోకి వచ్చిన నూతన విధానంతో బిల్లులను పట్టుకుని ఉద్యోగులు, సిబ్బంది ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది. ఉద్యోగులే కాదు కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు సైతం వారు చేసిన పనులకు సంబంధించి ఆయా శాఖల ద్వారా బిల్లులు ఆన్‌లైన్‌లో సమర్పిస్తే సరిపోతుంది.
పారదర్శకంగా చెల్లింపు
పేపర్‌లెస్ విధానంలో భాగంగా ఆయా శాఖల డీడీఓలు ప్రతి నెలా 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో బిల్లులను సమర్పించాల్సి ఉంటుంది. బిల్లులను నిర్ధారించేలా అందుకు అవసరమైన డాక్యుమెంట్స్ జతచేయాలి. ఈ బిల్లులు ఆన్‌లైన్‌లో ట్రెజరీ కార్యాలయ ఆడిటర్స్ (ఉద్యోగుల) లాగిన్‌కు వస్తాయి. వారు పరిశీలించి ధ్రువీకరించిన తర్వాత వాటికి టోకెన్ నంబర్లు జారీ చేస్తారు. ఆ వివరాలను ఎస్టీఓ లాగిన్‌కు పంపిస్తారు. ఎస్టీఓలు పరిశీలించి వివరాలు సక్రమంగా ఉన్నాయని ధ్రువీకరిస్తే ఏటీఓ లాగిన్‌కు వెళ్తాయి. ఏటీఓలు పరిశీలించాక నిబంధనల ప్రకారం ఉంటే వాటిని ఈ కుబేర్‌కు పంపిస్తారు. రూ.5లక్షలకు మించిన బిల్లులు ఉంటే మాత్రం వాటిని ట్రెజరీ డీడీ ధృవీకరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆమోదం అనంతరం సంబంధిత వ్యక్తుల ఖాతాల్లో వేతనాలు, బిల్లులు జమ కానున్నాయి. బిల్లులను తిరస్కరిస్తే అందుకు గల కారణాన్ని నమోదు చేయాలి. లేని పక్షంలో మెమోలు జారీ చేయనున్నారు. ప్రస్తుతం బిల్లుల పరిశీలన ప్రక్రియ జిల్లా స్థాయిలోనే జరగనుండగా భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఆ బిల్లు ఏదైనా జిల్లాకు పంపించి సంబంధిత ఆడిటర్లచే పరిశీలించేలా ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఏ బిల్లును ఎవరు ఆమోదిస్తున్నారో కూడా ఉద్యోగులకు తెలిసే అవకాశముండదు. తద్వారా ట్రెజరీలో అవినీతికి చెక్‌పడనుందనే భావనను ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.
జిలా సమాచారం..
సబ్‌ట్రెజరీ ఉద్యోగులు
బోథ్ 1,691
ఉట్నూర్ 1,701
ఆదిలాబాద్ 6,090
మొత్తం ఉద్యోగులు 9,492
ప్రతీనెల బిల్లుల చెల్లింపులు
(సగటు) రూ.211 కోట్లు
ఆన్‌లైన్‌లోనే పరిశీలన
ఎవరైనా బిల్లుల కాపీలతో కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే బిల్లుల ప్రక్రియ జరగనుంది. అధికారులు ఆన్‌లైన్‌లోనే బిల్లులు పరిశీలిస్తారు. సంతకాలను సైతం ఈ సిగ్నేచర్ ద్వారా చేస్తారు. ఈ నెల 15 నుంచి నూతన విధానం అమల్లోకి వచ్చింది.
– ఎన్.రామచంద్రరాజు, ట్రెజరీ శాఖ డీడీ


