ఆదిలాబాద్: రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ ఆర్‌ఎం విజయభాను తెలిపారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సుల రాకపోకలు పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆయా రూట్లలో 20 నుంచి 30 బస్సులను అదనంగా నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాధారణ రోజుల్లో 2.40 లక్షల మంది ప్రయాణిస్తుండగా, శుక్రవారం అదనంగా మరో లక్ష మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. బస్టాండ్లలో అధికారులు అందుబాటులో ఉండి ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందిస్తున్నారని పేర్కొన్నారు. రక్షాబంధన్ నేపథ్యంలో సోదరులకు రాఖీలు కట్టేందుకు మహిళలు, ప్రయాణికులు పెద్దఎత్తున స్వగ్రామాలకు పయనమయ్యారు. దీంతో ఆదిలాబాద్ బస్టాండ్ శుక్రవారం ప్రయాణికులతో కిక్కిరిసింది. రద్దీ నియంత్రణ, ప్రత్యేక బస్సుల నిర్వహణను ఆర్‌ఎంతో పాటు డీఎం ఎన్.సాయన్న పర్యవేక్షించారు.


