నిర్మల్‌టౌన్: నిర్మల్ సర్కిల్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ (సీటీవో) కొప్పెల గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయికృష్ణ సోమవారం రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ జ్యువెల్లరీ సంస్థకు సంబంధించిన 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల వ్యాపార రికార్డులపై అనుకూలమైన ఆడిట్ నివేదిక ఇచ్చి, తక్కువ పన్ను చెల్లించేలా టర్నోవర్ బాధ్యతను తగ్గించేందుకు అధికారులు రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారుడి అభ్యర్థనతో రూ.50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ముందస్తు ప్రణాళికలో భాగంగా ఏసీబీ అధికారులు సూచించిన విధంగా ఫిర్యాదుదారుడు లంచం మొత్తాన్ని తీసుకుని కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గోదావరికి రూ.50 వేలు అందజేయగా.. ఆమె ఆ మొత్తాన్ని సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయికృష్ణకు అందజేశారు. ఏసీబీ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రసాయన పరీక్షలు నిర్వహించగా.. లంచం తీసుకున్నట్లు నిర్ధారణ అయిందని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.


