ఆదిలాబాద్ అడవుల్లో కోల్పోతున్న పచ్చదనం ఆకుల రసాన్ని పీల్చుకుంటున్న కీటకాలు కళావిహీనంగా మారుతున్న వైనం ఆందోళన అవసరం లేదన్న వృక్షశాస్త్ర నిపుణులు
బోథ్: వర్షాకాలం సీజన్‌లో పచ్చదనంతో ప్రకృతి శోభను సంతరించుకోవాల్సిన ఆదిలాబాద్ జిల్లా అ టవీ ప్రాంతం ప్రస్తుతం ఊహించని రీతిలో రంగు మారి స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. జిల్లా లోని బోథ్, ఇచ్చోడ, బజార్‌హత్నూర్, భీంపూర్, తాంసీ, ఉట్నూరు మొదలుకొని పలు మండలాల్లో విస్తరించి ఉన్న కొండలు, గుట్టలపై టేకు చెట్ల ఆకులు పూర్తిగా ఎండిపోయినట్లు కనిపిస్తూ గోధుమ రంగులోకి మారుతున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే పచ్చటి అటవీ ప్రాంతం ఒక్కసారిగా కళావిహీనంగా మారడం స్థానిక ప్రజలతో పాటు పర్యావరణ ప్రేమికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి చెట్లకు ఏదో వింత అంటువ్యాధి సోకిందనే వదంతులు స్థానికంగా ప్రచారంలోకి వచ్చాయి.
కీటకాల దాడి
ఇది ప్రమాదకరమైన అంటువ్యాధి కాదని, వర్షాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా సంభవించే సహజసిద్ధమైన కీటకాల దాడి మాత్రమేనని వృక్షశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. వాతావరణంలో ఒక్కసారిగా తేమశాతం, ఉక్కపోత పెరిగినప్పుడు లద్దెపురుగు’ (టీక్ డెఫోలియేటర్–హైబ్లియా ప్యూరా), అస్థిపంజర పురుగు’ (టీక్ స్కెలెటోనైజర్–యుటెక్టొన మ్యాకరాలిస్) అనే లార్వాలు వృద్ధి చెందుతాయి. ఈ పురుగుల సమూహం టేకు ఆకుల్లోని పచ్చటి భాగాన్ని, పోషకాలను పూర్తిగా ఆరగించి, కేవలం ఆకుల నరాల వంటి ఈనెలను మాత్రమే వదిలేస్తాయి. దీనివల్ల ఆకులు పూర్తిగా ఎండిపోయి, మాడిపోయినట్లు కనిపిస్తాయి.
వర్షాలు కురిస్తే మళ్లీ పునరుజ్జీవం..
ఈ పురుగుల జీవిత చక్రం కొద్ది రోజుల్లో ము గియడం లేదా ఆయా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో వీటి ఉధృతి సహజంగానే తగ్గుముఖం పడుతుంది. ఆ వెంటనే టేకు చెట్లకు సరికొత్త లేత చిగుర్లు తొడిగి, కొండలు మళ్లీ మునుపటి సహజ పచ్చదనాన్ని సంతరించుకుంటాయి. అయినప్పటికీ అటవీ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి, తెగులు వ్యా ప్తి స్థాయిని నిశితంగా అంచనా వేస్తూ అవసరమైన పర్యవేక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరంఉంది.
టేకు జాతికే పరిమితం
లద్దెపురుగులు కేవలం టేకు చెట్ల ఆకులను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వల్ల, అటవీ ప్రాంతంలోని ఇతర వృక్ష జాతులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదు. వీటి జీర్ణవ్యవస్థ, శరీర నిర్మాణం టేకు ఆకుల్లోని రసాయన గుణాలకు అనుగుణంగానే ఉంటాయి. కాబట్టి పక్కనే వేప, రావి, మద్ది, మోదుగ లేదా ఇతర అటవీ వృక్షాలు ఉన్నప్పటికీ వాటి జోలికి అస్సలు వెళ్లవని నిపుణులు పేర్కొంటున్నారు.


