ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ మున్సిపల్ ప్రత్యేక సమావేశం బుధవారం మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. చైర్‌పర్సన్ అనూష అధ్యక్షతన సమావేశం జరిగింది. ఎజెండాలో ఐదు అంశాలు ఉండగా, రెండింటికి ఆమోదం లభించింది. మిగిలిన మూడు కౌన్సెల్‌లో ఉంచారు. మొదటి అంశంగా యూసీఎఫ్ కింద రూ.68 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వం 25శాతం, కేంద్ర ప్రభుత్వం వాటా 25శాతం, మిగిలిన 50శాతం రుణం ద్వారా సమకూర్చేలా ప్రతిపాదనలు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. రెండో అంశంగా ఆదిలాబాద్ పట్టణ ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చైర్‌పర్సన్ పేర్కొన్నారు. రూ.25లక్షల నిధులు కేటాయించే అంశంపై కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మూడో అంశంగా గతంలో కలెక్టర్ అనుమతితో ఆమోదం పొందిన ఎనిమిది అంశాలను కౌన్సెలింగ్‌కు సమాచారం నిమిత్తం తెలియజేశారు. నాల్గో అంశంగా న్యూస్ పేపర్ల టెండర్లకు సంబంధించిన బిల్లులను కౌన్సెలింగ్ ముందుంచారు. ఐదో అంశంగా మున్సిపాలిటీలో అప్పగించిన పనులను పూర్తి చేయని నలుగురు కాంట్రాక్టర్లను రెండేళ్ల పాటు డిబార్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పలు అంశాలపై సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ మెజార్టీ సభ్యుల మద్దతులో కౌన్సిల్‌లో ఆమోదం పొందినట్లు చైర్‌పర్సన్ ప్రకటించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, మున్సి పల్ వైస్ చైర్మన్ రోహిత్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


