ఆదిలాబాద్‌టౌన్: ఫోన్ పోగొట్టుకున్నా.. చోరీకి గురైన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాలో పోగొట్టుకున్న, చోరీకి గురైన రూ.12.5 లక్షల విలువైన 105 మొబైల్ ఫోన్లను స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో బాధితులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మొబైల్ పోగొట్టుకున్న వెంటనే https://www.ceir.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని, లేదా సమీప పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. ఇందుకోసం జిల్లాలో ప్రత్యేక రికవరీ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గడిచిన ఏడాది కాలంగా సుమారు 1,600 ఫోన్లను బాధితులకు తిరిగి అందజేసినట్లు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్ దుకాణ యజమానులు దొంగ ఫోన్లను కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.మౌనిక, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ప్రత్యేక రికవరీ బృందం సభ్యులు ఆర్‌ఎస్సై పి.గోపీకృష్ణ, మజీద్, అన్వేష్, నవనీత్, జుబేర్, ఇజాజ్ తదితరులు పాల్గొన్నారు.


