అంతిమ సంస్కారాలు నిర్వహించడంతో పాటు పలు సేవ కార్యక్రమాల్లో సైతం వీరు ముందుంటున్నారు. ఆకలితో అలమటిస్తున్న పేదలకు సొంత ఖర్చుతో భోజనం పెట్టడం, పండుగల సమయంలో వృద్ధాశ్రమాల్లో వృద్ధులతో కలిసి జరుపుకోవడం ప్రత్యేకం. రిమ్స్, రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో అన్నదానం నిర్వహించడం, యాచకులకు చలికాలంలో బ్లాంకెట్లు, వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, కరోనా సమయంలో పేదలకు సరుకులు పంపిణీ చేయడం వంటి అనేక సేవ కార్యక్రమాలను చేపట్టారు.
చిన్నారి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్తున్న సంస్థ సభ్యురాలు (ఫైల్)
అనాథ మృతదేహాలకు గౌరవప్రదంగా చివరి వీడ్కోలు పలుకుతూ సేవే పరమోధర్మం అంటూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు ఆ నలుగురు. మరణించిన తర్వాత అంత్యక్రియలు చేసేవారు లేక ఆస్పత్రి, మార్చురీ, రహదారులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న మృతదేహాలకు అన్ని తామై సంప్రదాయబద్దంగా అంతిమ సంస్కారం నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలోనూ తమ సేవానిరతిని చాటి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న వారే ‘మానవ సేవే మాధవ సేవ’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. – ఆదిలాబాద్‌టౌన్
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మానవ సేవే మాధవ సేవ స్వచ్ఛంద సంస్థను 2014లో నలుగురితో ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యురాలైన శశి కళ ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చిందం దేవిదాస్‌తో పాటు మరో ఇద్దరు శ్రీపాద శ్రీనివాస్, రాజు ఈ సేవ కార్యక్రమాల్లో ముందుంటున్నారు. జిల్లాలోని ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో గుర్తు తెలియని శవాలు, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినవారు, ఆస్పత్రిలోని మార్చురీలో రోజుల తరబడి ఉన్నటువంటి గుర్తు తెలియని మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అలాగే డబ్బులు లేని వారు వీరిని సంప్రదిస్తే వారి సంప్రదాయబద్దంగా నిర్వహించేందుకు సైతం ముందుంటున్నారు. ఆర్‌ఐతో పాటు కానిస్టేబుల్ సొంత డబ్బులతో వీటిని చేపడుతున్నారు. కట్టెలు, బట్ట, పూలు, ఇతరత్రా దాదాపు రూ.4వేల వరకు ఖర్చవుతుంది. శవయాత్ర వాహనాల్లో మృతదేహాలను శ్మశానవాటికకు తరలించి అక్కడ అంతిమ కార్యం పూర్తి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పాడెమోస్తూ తీసుకెళ్లి చివరి మజిలో భాగస్వాములవుతున్నారు.


