భూసేకరణపై స్పష్టత ఇవ్వాలి
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు భూసేకరణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని 4వ వార్డు అనుకుంట వాసులు సోమవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. కలెక్టర్ బయటకు రావాలని పెద్ద పెట్టున నినదించారు. ఆర్డీవో స్రవంతి, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీఎస్పీ జీవన్‌రెడ్డి వారి వద్దకు వచ్చి కలెక్టర్‌ను కలిసి సమస్య చెప్పుకోవాలని సూచించారు. అందుకు వారు నిరాకరిస్తూ మూడు గంటల పాటు అక్కడి నుంచి కదల్లేదు. కలెక్టర్ రాజర్షి షా వారి వద్దకు వచ్చి సమస్యపై ఆరా తీశారు. భూసేకరణపై సోషల్ మీడియాలో రోజుకో మ్యాప్ చక్కర్లు కొడుతుందని తమ భూములు పోతున్నాయా లేదా అనే సందేహం ఉందన్నారు. గ్రామానికి వచ్చే ప్రధాన రోడ్డు, కొన్ని నివాసాలు పోతున్నట్లుగా తెలుస్తుందని అవి పోకుండా చూడాలని కోరారు. ఈమేరకు కలెక్టర్ స్పందిస్తూ బయటకు వచ్చిన మ్యాప్ కేవలం డ్రాఫ్ట్ మాత్రమేనని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భూ సేకరణ జీవో మాత్రమే విడుదలైందని, ఎక్కడి నుంచి ఎంత భూమి సేకరించాలనే దానిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు అందలేదనన్నారు. విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.


