ఫలిస్తున్న పోరుబాట
అడ్డతీగల: నడుములు విరిగేంత అధ్వానంగా ఉన్న ఆ రోడ్డుపై నెలల తరబడి అవస్థలు పడలేక గిరిజనం ఒక్కటయ్యారు.. పిడికిలి బిగించారు.. రోడ్డును దిగ్బంధించారు.. వారి పోరాట పటిమకు ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చింది.. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. వివరాలివీ.. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుంచి అడ్డతీగల మండలంలోని పలు గ్రామాల మీదుగా జెడ్డంగి అన్నవరం వరకూ 11 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి గతంలోనే రూ.22 కోట్లు మంజూరయ్యాయి. అప్పట్లో అధికారులు కొద్ది మేర పనులు చేసి వదిలేశారు. దీంతో, ఆ రోడ్డు గోతులమయమై అధ్వాన స్థితికి చేరుకుంది. ఆ రహదారిపై ప్రయాణించే వారు ప్రమాదాల బారిన పడి, గాయపడిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు పదేపదే మొర పెట్టుకున్నా బాధిత గిరిజనుల గోడును ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడిన గిరిజనులు, ప్రజలు ఈ రోడ్డును వెంటనే పునర్నిర్మించాలనే డిమాండుతో గత ఏడాది సెప్టెంబర్ 12న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతల ఆధ్వర్యాన పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రహదారిని బాగు చేయిస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ నెరవేరకపోవడంతో గత జనవరి 22న మరోసారి తీవ్ర స్థాయిలో ఆందోళన నిర్వహించారు. రోడ్డును దిగ్బంధించి, రాకపోకలు నిలిపివేశారు. దీంతో దిగి వచ్చిన అధికారులు లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. అనంతరం, ఈ రోడ్డు పునర్నిర్మాణ పనులను ఆదివారం ఆరంభించారు. ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణలో సంబంధిత కాంట్రాక్టర్ ఏలేశ్వరం మండలం రమణయ్యపేట వైపు నుంచి పనులు ప్రారంభించారు. ట్విస్ట్ ఏమిటంటే ఈ ప్రజా సమస్యపై రెండు దఫాలు ఆందోళన చేసిన నేతలపై అడ్డతీగల, ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు నమోదు చేశారు.
డీఆర్‌ఓగా తిప్పేనాయక్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌ఓ)గా డి.తిప్పేనాయక్ కలెక్టరేట్‌లోని తన చాంబర్లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2024 ఎన్నికల సమయంలో డీఆర్‌ఓగా ఇక్కడ బాధ్యతలు నిర్వహించి, బదిలీపై అనంతపురం జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా వెళ్లారు. అక్కడ సుమారు 14 నెలల పాటు పని చేసి, తిరిగి జిల్లాకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా తిప్పేనాయక్‌ను కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఫలిస్తున్న పోరుబాట


