పూటుగా తాగి.. తన్నులాట | - | Sakshi
Sakshi News home page

పూటుగా తాగి.. తన్నులాట

Feb 9 2026 8:11 AM | Updated on Feb 9 2026 8:11 AM

పూటుగా తాగి.. తన్నులాట

పూటుగా తాగి.. తన్నులాట

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సెక్యూరిటీ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికీ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. రత్నగిరి దిగువన తొలి పావంచా వద్ద స్వామివారి ప్రసాదం కొనుగోలుకు వచ్చిన భక్తులు ఆదివారం క్యూలో ఘర్షణ పడి, దాదాపు పావుగంట పాటు కొట్టుకున్నారు. దీంతో, ప్రసాదం కొనుగోలుకు అక్కడకు వచ్చిన ఇతర భక్తులు భయభ్రాంతులకు గురై, ఏం జరుగుతుందోననే భయంతో పరుగులు తీశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు కానీ, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది కానీ అక్కడ లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క రోజే కాదు.. ప్రతి ఆదివారం లోవ దేవస్థానానికి వెళ్తున్న భక్తుల్లో కొంత మంది మద్యం తాగి, తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ప్రసాదాల కొనుగోలుకు ఆగుతున్నారు. ఈ క్రమంలో వారిలో వారు తరచుగా ఘర్షణకు దిగుతున్నా ఆపేవారే ఉండటం లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.

అందుబాటులో ఉండని సిబ్బంది

మరోవైపు తొలి పావంచా వద్ద ప్రసాదం కౌంటర్లలోని దేవస్థానం సిబ్బంది మధ్య సమన్వయం కొరవడుతోంది. ఈ నెల 2న తొలి పావంచా వద్ద ప్రసాదాల కొనుగోలుకు వెళ్లిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రసాదం ప్యాకెట్లు ఇచ్చే ఉద్యోగి బయటకు వెళ్లాడని, పావుగంట ఆగాలని అక్కడ ప్రసాదం టికెట్లు విక్రయించే మరో ఉద్యోగి చెప్పాడు. తాము చాలా దూరం వెళ్లాలని, ఇలా ఆలస్యం చేస్తే ఎలాగని ఆ భక్తులు పక్కనే గెస్ట్‌ హౌస్‌లో ఉన్న దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే ఆ కౌంటర్‌ వద్దకు వచ్చి, అక్కడి ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసి, దగ్గరుండి మరీ ప్రసాదాలు అమ్మించారు. ఆ సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా లేడు.

ఫ సత్యదేవుని తొలి పావంచా ప్రసాదం స్టాల్‌ వద్ద భక్తుల ఘర్షణ

ఫ పావుగంట పాటు కొట్టుకున్న వైనం

ఫ భయభ్రాంతులకు గురైన ఇతరులు

పోలీసులను నియమించే అవకాశం లేదు

తలుపులమ్మ లోవకు వెళ్లి వచ్చిన కొంత మంది భక్తులు మద్యం తాగి వచ్చి, అన్నవరం వచ్చి ఆ మత్తులో ప్రసాదాల కౌంటర్ల వద్ద ఘర్షణ పడుతున్నారు. వారిని నియంత్రించేలా అక్కడ నియమించడానికి తగినంత మంది పోలీసులు మాకు లేరు. దేవస్థానమే అక్కడ సెక్యూరిటీ గార్డులను నియమించాలని చాలాసార్లు చెప్పాం. అయినప్పటికీ వారు నియమించడం లేదు. ఇప్పటికై నా దేవస్థానం అదివారం నాడు అక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డులను నియమించాలి. ప్రసాదాల కౌంటర్‌ వద్ద ఘర్షణ పడిన వారు మాకు ఎటువంటి ఫిర్యాదూ చేయలేదు.

– శ్రీహరిబాబు, ఎస్సై, అన్నవరం

అంత సెక్యూరిటీ ఉన్నా ప్రయోజనమేదీ!

అన్నవరం దేవస్థానంలో వంద మందికి పైగా సెక్యూరిటీ గార్డులు, 38 మంది పోలీసు శాఖకు చెందిన హోం గార్డులు పని చేస్తున్నారు. తొలి పావంచా వద్ద ఒక్క భద్రతా సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. కనీసం ఇద్దరు హోంగార్డులు లేదా ఇద్దరు సెక్యూరిటీ గార్డులున్నా ఇలాంటి ఘర్షణలను నివారించే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సమయంలో ఆ ఒక్కరు కూడా ఉండటం లేదనే విమర్శ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement