అసలు రోగం
సర్కారు నిర్లక్ష్యమే..
రంపచోడవరం: బాగా చదువుకుని, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారాలనే ఆశతో వస్తున్న గిరి బాలలకు.. సర్కారు నిర్లక్ష్యమే శాపంగా మారుతోంది. మన్యసీమలో ప్రభుత్వం చాలా కాలంగా గిరిజన సంక్షేమ అధికారులను పూర్తి స్థాయిలో నియమించడం లేదు. ఫలితంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఆశ్రమ పాఠశాలలపై సరైన పర్యవేక్షణ కొరవడుతోంది. వీటన్నింటి నేపథ్యంలోనే గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో అభం శుభం తెలియని విద్యార్థులు తరచుగా అనారోగ్యాల పాలవుతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 89 మంది విద్యార్థులు అస్వస్థత పాలవడానికి ఈ నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ పరిస్థితిని చక్కదిద్దాల్సిన ప్రభుత్వం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు ఆదివాసీల నుంచి వస్తున్నాయి.
అరకొరగా ఏటీడబ్ల్యూఓలు
జిల్లావ్యాప్తంగా 78 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, 288 గిరిజన ప్రాథమిక పాఠశాలలు, 11 గిరిజన సంక్షేమ వసతి గృహాలు, 9 గురుకుల పాఠశాలలు, 6 కళాశాలలు, 6 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో 4,093 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఆహారం అందించేందుకు నిబంధనల ప్రకారం ప్రతి రోజూ నిర్ణీత మెనూ అమలు చేయాలి. అయితే, ఆవిధంగా మెనూ అమలవుతోందో లేదో పర్యవేక్షించేందుకు తగినంత మంది అధికారులు జిల్లాలో లేరు. ప్రతి మండలానికి ఒక సహాయ గిరిజన సంక్షేమ అధికారి (ఏటీడబ్ల్యూఓ) ఉండాలి. కానీ, మూడు నాలుగు మండలాలకు కలిపి ఒకరికి ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. చింతూరు పరిధిలోని నాలుగు మండలాలకు ఒకరు.. అడ్డతీగల, రాజవొమ్మంగి, గంగవరం, వై.రామవరం మండలాలకు ఒకరు.. రంపచోడవరం, మారేడుమిల్లి, దేవీపట్నం మండలాలకు ఒకరు చొప్పున మాత్రమే ఏటీడబ్ల్యూఓలున్నారు. వీరిలో ఒక్కరు మాత్రమే రెగ్యులర్ ఏటీడబ్ల్యూఓ కాగా, మరో ఇద్దరు వార్డెన్లను ఇన్‌చార్జి ఏటీడబ్ల్యూఓలుగా పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్‌ఏసీ) నియమించారు. మరోవైపు ఏటీడబ్ల్యూఓల నియామకంలో పైరవీలకు పెద్దపీట వేస్తున్నారు. ఇదే విషయంపై గిరిజన సంక్షేమ శాఖ డీడీకి ప్రస్తుత ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి షోకాజ్ నోటీసు కూడా జారీ చేయడం గమనార్హం. మరోవైపు ఆశ్రమ పాఠశాలల్లో డిప్యూటీ వార్డెన్ల నియామకానికి సైతం తీవ్రమైన పోటీ ఉంటోంది.
పర్యవేక్షణ గాలికి..
తమ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ సక్రమంగా అమలవుతోందా, బోధన ఎలా జరుగుతోంది, విద్యార్థుల సామర్థ్యం వంటి అంశాలను ఏటీడబ్ల్యూఓలు పరిశీలించాలి. అవసరమైన విషయాలపై గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌కు నివేదికలివ్వాలి. అయితే, పూర్తి స్థాయిలో ఏటీడబ్ల్యూఓలు లేకపోవడంతో ఆశ్రమ పాఠశాలల్లో పర్యవేక్షణను గాలికొదిలేస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలకు వెళ్లి వార్డెన్‌తో మాట్లాడి వెళ్లిపోవడం మినహా మిగిలిన అంశాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. మరోవైపు డిప్యూటీ వార్డెన్లు సైతం నిబంధనల ప్రకారం మెనూ అమలు చేయడం లేదు. కొద్ది రోజుల క్రితం రాజవొమ్మంగి మండలంలోని ఓ పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదనే ఫిర్యాదు వచ్చింది. అనేక పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే, ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్లను సకాలంలో శుభ్రం చేయించడం లేదు. దోమ తెరలు కూడా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు ఇతర మౌలిక వసతులు సైతం లేకుండానే విద్యార్థులు రోజులు గడపాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి.
మరో 14 మంది ఆస్పత్రిపాలు
మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉడకని ఇడ్లీ, నిల్వ శనగ పిండితో చేసిన బొంబాయి చెట్నీ తిని శనివారం 89 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వీరందరికీ రంపచోడవరం, మారేడుమిల్లి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆదివారం మరో 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారు కూడా రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 62 మందిని ఆస్పత్రి నుంచి డిశార్జ్ చేశారు. మిగిలి 41 మందికి చికిత్స అందిస్తున్నారు. బాధిత విద్యార్థులను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి, సభ్యులు గొర్లె సునీత ఆస్పత్రిలో పరామర్శించారు.
విద్యార్థులు మరణిస్తున్నా..
గిరిజన విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, పరోక్షంగా వారి మరణాలకు కారకులవుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.
కొద్ది నెలల కిందట రంపచోడవరం మండలం వాడపల్లిలో ఓ విద్యార్థిని మధ్యాహ్న భోజన సమయంలో తరగతి గదిలో ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమగ్ర విచారణ జరగలేదు.
రంపచోడవరం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు కొన్నాళ్ల కిందట కాలువలో స్నానం చేస్తూ మృతి చెందారు.
మారేడుమిల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. దీనిపై ఇప్పటికీ ఎటువంటి విచారణ నివేదికనూ అధికారులు వెల్లడించలేదు.
ఆశ్రమ పాఠశాలల్లో అనేక తప్పులకు పాల్పడిన వారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తున్నారు. తిరిగి కొద్ది రోజుల్లోనే విచారణ పెండింగ్ పేరిట వారు ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. గిరిజన సంక్షేమ కార్యాలయం(విద్య)లో పైరవీలతో పనులు జరగడమే ఇందుకు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆశ్రమ విద్యపై పర్యవేక్షణ కరవు
మూడు నాలుగు మండలాలకు
ఒక్కరే ఏటీడబ్ల్యూఓ
మొక్కుబడి పర్యటనలకే పరిమితమవుతున్న అధికారులు
పట్టించుకోని ప్రభుత్వం
వార్డెన్ సస్పెన్షన్
దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పుడ్ పాయిజనింగ్ జరిగి మొత్తం 103 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై అధికారులు స్పందించారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులుగా పేర్కొంటూ వార్డెన్ గణపతిని, వంట మనిషి లక్ష్మిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
అసలు రోగం
అసలు రోగం


