● జంక్షన్.. యమ టెన్షన్
అడ్డతీగల మీదుగా సాగుతున్న 516–ఇ జాతీయ రహదారికి చేరే జంక్షన్లు ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. ఈ ప్రాంతంలో నిత్యం అనేక ట్రాక్టర్లపై ఇసుక రవాణా చేస్తున్నారు. పరిమితికి మించి ట్రాక్టర్ ట్రాలీపై ఇసుక లోడ్ చేసి, తరలిస్తున్నారు. అలా, అధికంగా లోడ్ చేసిన ఇసుక ఆ వాహనాల వేగానికి ఎగిరి ప్రధాన రహదారిపై పడుతోంది. అలా పోగు పడిన ఇసుక అడ్డతీగల నుంచి జాతీయ రహదారికి చేరడానికి ఉన్న మలుపుల్లో రోడ్డు పైనే పోగు పడుతోంది. ఆయా ప్రాంతాల్లో వాహనాలు ఆ ఇసుక వల్ల అదుపు తప్పి, జారి బోల్తా పడుతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు గాయపడుతున్నారు. దీనికి తోడు కాంక్రీటు పనులకు క్వారీ క్రషర్ల నుంచి లారీలపై రవాణా చేస్తున్న బేబీ చిప్స్ వంటివి కూడా రహదారిపై పడి వాహనాలు అదుపు తప్పుతున్నాయి. ఇకనైనా ఇసుక, చిప్స్ తరలించే వాహనాల యజమానులకు పోలీసు శాఖ అధికారులు సరైన ఆదేశాలివ్వాలని, ఆయా మెటీరియల్ రోడ్డుపై పడకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
– అడ్డతీగల


