సగర్వంగా.. ఎగిరింది తిరంగా.. | - | Sakshi
Sakshi News home page

సగర్వంగా.. ఎగిరింది తిరంగా..

Jan 27 2026 7:36 AM | Updated on Jan 27 2026 7:36 AM

సగర్వ

సగర్వంగా.. ఎగిరింది తిరంగా..

అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు

ఆకట్టుకున్న పోలీసుల కవాతు,

శకటాల ప్రదర్శన

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

రంపచోడవరం: మువ్వన్నెల జెండా ఎగిరింది.. ప్రతి మదీ మురిసింది.. జిల్లా స్థాయి గణతంత్ర సంబరాలకు రంపచోడవరం వేదికై ంది. ఒకవైపు పోలీసుల కవాతు.. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇంకోవైపు అభివృద్ధి నమూనాల ప్రభుత్వ శకటాల ప్రదర్శనలతో ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

కొత్త జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కలసికట్టుగా పనిచేద్దామని పోలవరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ బచ్చు స్మరణ్‌రాజ్‌ పిలుపునిచ్చారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా సోమవారం రంపచోడవరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ (అనంతబాబు), ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ చోళ్ల బొజ్జిరెడ్డి, ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి, ఎస్టీ కమిషన్‌ మెంబర్‌ గొర్లె సునీత, సబ్‌ కలెక్టర్‌ శుభమ్‌ నొఖ్వాల్‌, ఓఎస్‌డీ పంకాజ్‌ కుమార్‌మీనా, ఏఎస్పీ బి.హేమంత్‌, డీఎఫ్‌ఓ శివకుమార్‌ గంగల్‌, డీఎస్పీ సాయిప్రశాంత్‌, సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం పూర్తి స్థాయిలో 1950వ సంవత్సరం జనవరి 26న అమల్లోకి వచ్చిందన్నారు. దీనిని పురస్కరించుకుని గణతంత్ర దినోత్సవాన్ని ఏటా జరుపుకొంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో 17,323 మంది రైతులకు 11.385.10 క్వింటాళ్ల వరి విత్తనాలను అందించామని జేసీ తెలిపారు. అదేవిధంగా 2,909 మంది రైతులకు 288.6 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు, 7,175 మందికి 818.46 క్వింటాళ్ల అపరాల విత్తనాలు పంపిణీ చేశామన్నారు. ఉద్యాన పంటల అభివృద్ధికి 1,255 ఎకరాల్లో జీడిమామిడి, 155 ఎకరాల్లో సీతాఫలం తోటలు కొత్తగా వేయించామన్నారు. అదేవిధంగా 1,188 ఎకరాల్లోని ముదురు జీడిమామిడి తోటల్లో తోటల పునరుద్ధరణ పథకం అమలు చేశామని అన్నారు. మాతా శిశు మరణాల నివారణకు వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా తగిన చర్యలు తీసుకుంటున్నామని జేసీ తెలిపారు. జిల్లాలోని గిరిజన ఆశ్రమ, జీపీఎస్‌, సంక్షేమ, గురుకుల తదితర పాఠశాలలు, వసతి గృహాల్లో 44,093 విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నామని తెలిపారు.

పూర్తి స్థాయిలో తాగునీటి కోసం..

గ్రామీణ నీటిపారుదల శాఖ ద్వారా రూ.133.65 కోట్లు మంజూరు కాగా, 529 గ్రామాలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందిస్తున్నామని జేసీ స్మరణ్‌రాజ్‌ అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా పీఎం జన్మన్‌ ఫేజ్‌ 1, 2 ద్వారా 31 మల్టీపర్పస్‌ సెంటర్లకు నిధులు మంజూరు కాగా 19 పనులు పూర్తి చేశారని వివరించారు. పేదలకు పక్కా గృహాల నిర్మాణంలో భాగంగా పీఎం గ్రామీణ పథకం ద్వారా 2,998 గృహాలకు నిధులు మంజూరు కాగా 789 ఇళ్లు పూర్తి చేశారన్నారు. ఏపీ ఈపీడీసీఎల్‌ ద్వారా పీఎం జన్మన్‌ పథకం కింద రూ.1,576 లక్షల అంచనాతో 4,269 విద్యుత్‌ లేని పీవీ టీజీల గృహాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. నాబార్డ్‌ నిధులతో జడ్డంగి గ్రామం నుంచి గొంటువానిపాలెం గ్రామాల మధ్యలో 9.20 కిలోమీటర్ల రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. అటవీ హక్కుల చట్టం ద్వారా వ్యవసాయం చేసుకుంటున్న 24,587 గిరిజన రైతులకు 82,646 ఎకరాల భూమికి ఆర్వోఎఫ్‌ఆర్‌ చట్టం ద్వారా పట్టాలు అందించామన్నారు. జిల్లాలోని 8 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులలో 669 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా రోజూ బాలబాలికలకు ప్రభుత్వం నిబంధన ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. పోలవరం నిర్వాసితులకు భూమికి భూమి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పర్యాటక అభివృద్ధి దిశగా..

ఎకో టూరిజం ద్వారా గుడిస, మారేడుమిల్లి, వాలమూరు, రంప పర్యాటక ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జేసీ తెలిపారు. అదేవిధంగా గుడిస, పిడమర్రి గ్రామస్తులకు జీవనోపాధి నిమిత్తం టెంటు సామగ్రి అందించామన్నారు. తొలుత జేసీ పోలీస్‌ కవాతు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖలకు సంబంధించిన శకటాలను ముఖ్య అతిథులు తిలకించారు. వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర సమరయోధులు చంద్రయ్య ముదిమనువలు సత్యనారాయణ, శివ, వెంకటరమణ, గంటందొర మనుమలు పండా ఆదినారాయణదొర, మల్లుదొర మనమడు కుంజం వెంకటేశ్వర్లుదొర, అల్లూరి మనమడు శ్యామల వెంకటరామయ్యలను జేసీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌, ఎమ్మెల్యేలు సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో 9 పాఠశాలలు పాల్గొనగా ఇర్లపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల, రంపచోడవరం డీఎడ్‌ కళాశాల, బాలుర ఆశ్రమ పాఠశాలకు వరుసగా మొదటి మూడు స్థానాలు దక్కాయి. వివిధ శాఖల శకటాల ప్రదర్శనలో డీఆర్డీఏ వెలుగు ప్రథమ, వైద్య ఆరోగ్య శాఖ ద్వితీయ, ఏపీ ఈపీసీడీసీఎల్‌ మూడో స్థానాల్లో నిలిచారు. విధుల్లో ఉత్తమ సేవలు అందించిన 200 మందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను జేసీతో కలసి ఎమ్మెల్సీ అనంతబాబు సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీలు బందం శ్రీదేవి, కె ఆనంద్‌, జెడ్పీటీసీలు పండా వెంకటలక్ష్మి, గొర్లె బాలాజీబాబు, బేబిరాణి, వైస్‌ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ, సర్పంచ్‌ మంగా బొజ్జయ్య, ఎంపీటీసీ ఉలవల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సగర్వంగా.. ఎగిరింది తిరంగా.. 1
1/2

సగర్వంగా.. ఎగిరింది తిరంగా..

సగర్వంగా.. ఎగిరింది తిరంగా.. 2
2/2

సగర్వంగా.. ఎగిరింది తిరంగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement