వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అడ్డతీగల: వైద్య ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డీఏ రత్నరాజు అన్నారు. సోమవారం అడ్డతీగలలో యూనియన్ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు పి.సత్యవతి, బి.దుర్గారావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో పదోన్నతులు కల్పించాలన్నారు. మహిళా ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని అన్నారు. గత 14 మాసాలుగా సీతపల్లి ఆసుపత్రి స్టాఫ్ నర్స్ జీతాలు ఇవ్వడం లేకపోవడాన్ని తప్పుపట్టి, ఆమె జీతాల బిల్లులు ప్రొసీడింగ్ ఆర్డర్లు యూనియన్ పోరాటం వల్ల రప్పించామన్నారు. నేషనల్ హెల్త్ మిషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు బకాయి ఉన్న జీతభత్యాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎస్టీ బ్యాక్ లాగ్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని జిల్లా అధ్యక్షురాలు పి.సత్యవతి అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎఫ్‌టీఏ, డీఏ, యూనిఫామ్, అలవెన్స్ వంటివి మంజూరు చేయాలని యూనియన్ ఉపాధ్యక్షుడు బి.దుర్గారావు కోరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బి.యోహాన్ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక విధానాలను ఆమోదించడం దుర్మార్గం
రాయవరం: కార్మికులకు నష్టాన్ని కలిగించే కేంద్ర విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకుండా అసెంబ్లీలో ఆమోదించడం దుర్మార్గ చర్యగా తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ కార్మిక సంఘ నాయకుడు రాగుల రాఘువులు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని చెల్లూరు పంచాయతీలో సోమవారం కార్మిక సమస్యలపై మాట్లాడేందుకు వచ్చిన సందర్భంగా వారు మాట్లాడారు. కార్మికులకు రక్షణగా ఉన్న 26 చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు అనుకూలంగా లేబర్ కోడ్‌లను మార్చి పోరాడి సాధించుకున్న 8గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 10 గంటల భారాన్ని కార్మికుల మీద రుద్దుతున్నారన్నారు. లేబర్ కోడ్‌ల రద్దు కోరుతూ ఫిబ్రవరి 12న దేశ వ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు వేతనాలు మొదటి వారంలో ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న అరియర్స్ చెల్లించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు జొన్నకూటి రవికుమార్, లంక రాంబాబు పాల్గొన్నారు.
భీష్మ ఏకాదశి ఏర్పాట్లపై
నేడు సమీక్ష
అన్నవరం: ఈ నెల 29న భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి ఒకటో తేదీన మాఘ పౌర్ణమి, మాఘ మాసంలో ఇతర పర్వదినాల సందర్భంగా సత్యదేవుని ఆలయానికి వేలాదిగా భక్తులు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహిస్తున్నారు.
వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి


