అడ్డగోలుగా టేకుచెట్ల నరికివేత! | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా టేకుచెట్ల నరికివేత!

Jan 26 2026 4:06 AM | Updated on Jan 26 2026 4:06 AM

అడ్డగ

అడ్డగోలుగా టేకుచెట్ల నరికివేత!

అడ్డతీగల: జాతీయ రహదారి 516 నిర్మాణంలో భాగంగా రక్షిత అటవీ ప్రాంతాల్లో టేకు చెట్ల నరికివేత వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. కలప సేకరణలో కొంత మేరకు పనులు చేసిన అటవీ శాఖ అధికారులు చాలాచోట్ల విలువైన టేకు చెట్లు వదిలేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివారం నుంచి జాతీయ రహదారి పనులు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది ఇష్టానుసారంగా టేకు చెట్లు నరికివేసి తమ వాహనాల్లోనే తరలిస్తున్నారని పలువురు అంటున్నారు. అడ్డతీగల అటవీ క్షేత్రం కిందకు వచ్చే పైడిపుట్ట వద్ద తపస్వికొండ దక్షిణ రక్షిత అటవీ ప్రాంతంలోని 1.81 హెక్టార్ల విస్తీర్ణంలోని 600 మీటర్ల మేరకు, అలాగే పింజరికొండ రక్షిత అటవీ ప్రాంతంలోని 3.34 హెక్టార్ల విస్తీర్ణంలోని 1,049 మీటర్ల మేరకు జాతీయ రహదారి వెళ్తుంది. ఏడాదిన్నర క్రితం జాతీయ రహదారి ఇంజినీరింగ్‌ అధికారులు ఎంత మేరకు రహదారి నిర్మించనున్నదీ మార్కింగ్‌ వేసి సరిహద్దు సిమెంట్‌ స్తంభాలను వేశారు. దాని పరిధిలోని చెట్ల నరికివేత, ఇతరత్రా వాటికి నేషనల్‌ హైవే అథారిటీ నుంచి యూజర్‌ చార్జీలు చెల్లించారు. దీనికోసం అటవీశాఖ అధికారులు ఎస్టిమేట్లు వేశారు. ఈ రెండు చోట్ల విలువైన టేకుచెట్లు, మారుజాతి కలప ఉంది. అటవీ ఉన్నతాధికారుల అనేక పరిశీలనల అనంతరం పైడిపుట్ట వద్ద రక్షిత అటవీ ప్రాంతంలో మారుజాతి కలపతో పాటు అడ్డతీగల వద్ద పింజరికొండ రక్షిత అటవీ ప్రాంతంలో టేకు చెట్లు ఉన్నట్లు నిర్ధారించారు. చెట్లు నరికివేత, లోడింగ్‌, అన్‌లోడింగ్‌, రవాణా నిమిత్తం నిధులు అటవీశాఖ ఉన్నతాధికారులు విడుదల చేస్తారు. ఆయా పనుల నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుని వాహనాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. కలప సేకరించిన తరువాత రాజమహేంద్రవరంలోని కలప డిపోనకు తరలించాలి. ఆయా పనుల నిర్వహణ కోసం నిధుల వ్యయంలో నిబంధనలను తుంగలోకి తొక్కి జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో వినియోగించే వాహనాలు, యంత్రాలను వినియోగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేషనల్‌ హైవే అథారిటీ చెల్లించిన యూజర్‌ చార్జీలు ఎంత, ఎవరిని చెట్ల నరికివేతకు వినియోగించారు..! లోడింగ్‌, అన్‌లోడింగ్‌కి ఉపయోగించిన యంత్రాలు ఏంటి, సేకరించిన కలప రాజమహేంద్రవరం కలప డిపోనకు రవాణా చేసిన వాహనాల వివరాలను బహిర్గతం చేస్తే అసలు విషయాలు తెలుస్తాయని పలువురు అంటున్నారు. దీనిపై అడ్డతీగల సబ్‌ డీఎఫ్‌ఓ సుబ్బారెడ్డిని వివరణ కోరగా ఒక్కోచోట 30 మీటర్లు, మరికొన్ని చోట్ల 22 మీటర్ల మేర రోడ్డు నిర్మిత ప్రాంతంలో చెట్ల తొలగింపు చేపట్టారన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తామన్నారు. నిబంధనల ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

పట్టించుకోని అటవీ శాఖ అధికారులు

అడ్డగోలుగా టేకుచెట్ల నరికివేత!1
1/1

అడ్డగోలుగా టేకుచెట్ల నరికివేత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement