సూర్యప్రభ వాహనం.. శ్రీవారికి వైభవం
కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. భక్తుల కోలాహలం మధ్య స్వామివారు సూర్యప్రభ వాహనంపై విహరించారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు నిత్య పూజల అనంతరం రథసప్తమి పర్వదినం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, సూర్య నమస్కారాలు జరిపారు. వేంకటేశ్వరస్వామికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. మాఢ వీధుల్లో శ్రీవారిని సూర్యప్రభ వాహనంపై విశేషంగా స్వర్ణాభరణాల అలంకార భూషితునిగా అలంకరించి ఊరేగించారు. ఆ సమయంలో భక్తకోటి అఖండ గోవింద నామస్మరణ, వేంకటేశ్వరస్వామి సంకీర్తనలతో వాడపల్లి క్షేత్రం ప్రతిధ్వనించింది. వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు సూర్యప్రభ వాహనంపై స్వామివారిని కనులారా వీక్షించి తన్మయత్వం చెందారు. అనంతరం ఆలయంలో మూలవిరాట్‌ను దర్శించుకుని, తీర్థప్రసాదాలు, అన్న ప్రసాదం స్వీకరించారు.
గోవిందమాల దీక్షధారణ
మాఘ శుద్ధ సప్తమి సందర్భంగా వాడపల్లి వేంకటేశ్వరస్వామి సన్నిధిలో భక్తులు గోవిందమాల దీక్షధారణ (శ్రీనివాస శరణాగత దీక్ష) చేపట్టారు. వచ్చే నెల 16వ తేదీ మాఘ బహుళ చతుర్ధశి వరకూ భక్తులు గోవిందమాల ధరించి, 23 రోజుల పాటు అర్ధ మండల దీక్ష చేస్తారు. 16న పూర్ణాహుతితో ఈ దీక్ష పూర్తవుతుందని వారు తెలిపారు. దీక్ష చేపట్టిన భక్తులను డీసీ అండ్ ఈఓ చక్రధరరావు అభినందించారు.
సూర్యప్రభ వాహనం.. శ్రీవారికి వైభవం


