కె.పెదపూడిలో అగ్ని ప్రమాదం
అంబాజీపేట: విద్యుత్ షార్ట్ స ర్క్యూట్ కారణంగా ఆదివారం ఓ పెంకుటిల్లు కాలిపోయింది. దీనికి సంబంధించి స్థానికుల కథనం ప్రకారం.. కె.పెదపూడిలో రుక్మిణీ సత్యభామా సమేత కృష్ణారాయుడు దేవస్థానం అర్చకుడు, టీవీ మెకానిక్ పాణింగపల్లి గోపాలాచార్యులుకు చెందిన పెంకుటిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో 5 ఎల్‌ఈడీ టీవీలు, ఫ్రిజ్, ఏసీలు, వాషింగ్ మెషీన్, రూ.80 వేలు, నాలుగు తులాల బంగారం, 10 తులాల వెండితో పాటు గృహోపకరణాలు, విలువైన పత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. అమలాపురం అగ్నిమాపక సి బ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.25 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. గోపాలాచార్యులు ఎలక్ట్రికల్ మెకానిక్ కావడంతో కస్టమర్లు రిపేర్లకు ఇచ్చిన వస్తువులు ఈ ప్రమాదంలో కాలిపోయాయి.


