గిరిగీసి.. ఆపేసి..
దారి బాగుంటేనే ఊరు బాగుంటుంది.. పల్లె ప్రగతి సాధ్యమవుతోంది.. అభివృద్ధి ఆశ నెరవేరుతోంది.. అయితే శాఖల సమన్వయం లోపంతో రోడ్ల అభివృద్ధికి గ్రహణం పట్టింది.. ఏళ్ల తరబడి అనుమతులు రాక, అధికారులు పట్టించుకోక రవాణా సదుపాయం అగమ్యగోచరంగా మారింది.. చాలా గ్రామాలకు ఇంకా కాలినడకనే వెళ్లాల్సి వస్తోంది.. ‘గిరి’గీసి అభ్యంతరాలు రాయడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు మారింది. ఫలితంగా గిరిజనానికి రాచ‘బాట’ కరవైంది.. కొత్త జిల్లా పోలవరం ఏర్పాటుతోనైనా సమస్యలు తీర్చాలనే డిమాండ్ ప్రతి నోటా వినిపిస్తోంది.
రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతంలో అటవీ అభ్యంతరాలతో అనేక రోడ్ల నిర్మాణ ముందుకు కదలడం లేదు. ఈ పనులు చాలాచోట్ల మధ్యలోనే నిలిచిపోయాయి. ఏళ్ల తరబడి అటవీ అనుమతులు రాకపోవడంతో గిరిజనులకు రవాణా సదుపాయం దూరమైంది. అభివృద్ధి పనులకు అటవీ అనుమతులు మంజూరు చేయాలని కోరినా ఫలితం లేకుండా పోతుంది. ఈ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉంది.
మారేడుమిల్లి మండలం వేటుకూరు నుంచి తాడేపల్లి వెళ్లే రోడ్డు నిర్మాణం ఏళ్ల తరబడి నిలిచిపోయింది. ఈ మధ్యలో సుమారు పది గ్రామాలు ఉన్నాయి. ఐదు వేల జనాభా వరకూ నివసిస్తున్నారు. వీరికి అవసరం వచ్చినా మారేడుమిల్లి రావాల్సి ఉంటుంది. అయితే అటవీ శాఖ అభ్యంతరాలు కారణంగా రోడ్డు నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేశారు. వేటుకూరు నుంచి మద్దివీడు వరకూ రోడ్డు అభివృద్ధి జరగాల్సి ఉంది. ఆగిపోయిన రోడ్డు సుమారు పది కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే పది గ్రామాల ప్రజలు మండల కేంద్రం మారేడుమిల్లి వచ్చేందుకు 17 కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిపోతుంది. రోడ్డు పూర్తికాక ఆయా గ్రామాల గిరిజనులు రంప మీదుగా రంపచోడవరం వచ్చి మారేడుమిల్లి వెళ్లాల్సి వస్తుంది. అంటే సుమారు 40 కిలోమీటర్లు మేర ప్రయాణించాల్సి వస్తుంది. ఇది దూరాభారంతో పాటు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు.
ఏళ్లకాలంగా ‘దారి’చూపులు
రంపచోడవరం మండలం కాకవాడ నుంచి ఆకూరు రోడ్డు కూడా అటవీ అభ్యంతరాలతో నిలిచిపోయింది. ఈ మధ్యలో సుమారు 10 గ్రామాల వరకూ ఉంటాయి. 3 వేల మంది జనాభాకు ఆసరాగా ఉన్న ఈ రోడ్డు నిర్మాణానికి ఏళ్లకాలంగా ఎదురుచూస్తున్నారు. వై.రామవరం, రాజవొమ్మంగి మండలాల్లో కూడా అనేక రహదారులు అటవీ అభ్యంతరాలతో ఆగిపోయాయి. ఏజెన్సీలో ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోవడంతో 25 రోడ్ల వరకూ నిలిచిపోయాయి. మారేడుమిల్లి మండలం మల్లవరం–గోలిగోపురం మధ్య రహదారికీ గ్రహణం పట్టింది. పాటకోట–మంగంపాడు మధ్య రోడ్డు నిర్మాణ పనులు జరగలేదు. అలాగే వై.రామవరం– కోట రోడ్డు కూడా నిలిచిపోయింది. పోతవరం– వై.రామవరానికి సంబంధించి 20 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం అక్కడి ప్రజలకు కలగా మారింది.
‘దారి’లోకి తేవాలని..
రంపచోడవరం మండలం పందిరిమామిడి నుంచి వై.రామవరం మండలం చవిటిదిబ్బల రోడ్డు నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది. వాడపల్లి నుంచి కోట మధ్యలో సుమారు పది కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో రోడ్డు భవనాల శాఖ పనులు మధ్యలోనే ఆపేసింది. రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇస్తూ మరోచోట అటవీని అభివృద్ధి చేసేందుకు ఆర్‌అండ్‌బీ శాఖ అటవీ శాఖకు డబ్బులు కూడా చెల్లించింది. అయినా నేటికీ అనుమతులు రాలేదు. ఇటీవల ఆయా గ్రామాల గిరిజనులు రంపచోడవరం ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కి వచ్చి రోడ్డుకు అనుమతులు మంజూరు చేయించాలని కోరుతూ అర్జీలు సమర్పించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే వై.రామవరం, రంపచోడవరం, మారేడుమిల్లి మండలాలకు చెందిన 40 గ్రామాల గిరిజనులకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది.
అనుమతుల కోసం
దరఖాస్తు చేశాం
అటవీ శాఖ అభ్యంతరాలతో నిలిచిపోయిన రోడ్డు నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి అనుమతుల కోసం దరఖాస్తు చేశాలు. అనుమతులు మంజూరైతే పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. అటవీ శాఖతో కలిసి సంయుక్తంగా నివేదికలు పంపించినా అనుమతులు రావడానికి జాప్యం జరుగుతుంది.
–ఐ.శ్రీనివాసరావు, ఈఈ,
గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ
రోడ్డు నిర్మాణాలు
పూర్తి చేయండి
పందిరిమామిడి నుంచి చవిటిదిబ్బల పది కిలోమీటర్ల రోడ్డు అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో నిలిచిపోయింది. రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తే గిరిజనులకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. ఎన్నో సార్లు అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినా స్పందన లేదు.
–మంగమ్మ,
ఎంపీటీసీ సభ్యురాలు, బోలగొండ
ఫ ప్ర‘గతి’ లేని రహదారులు
ఫ అటవీ అభ్యంతరాలే అసలు సమస్య
ఫ ఏళ్ల తరబడి సాగని రోడ్ల నిర్మాణాలు
ఫ శాఖల మధ్య సమన్వయ
లోపంతో గ్రహణం
వేగవంతంగా ప్రయత్నిస్తాం..
పందిరిమామిడి–చవిటిదిబ్బలు రోడ్డు పనులకు అటవీ అభ్యంతరాలు తొలగించేందుకు వేగంగా పనిచేస్తున్నాం. జిల్లా కలెక్టర్, డీఎఫ్‌ఓ, రెవెన్యూ సహకారంతో అనుమతులు వస్తాయి. అటవీ శాఖకు కేటాయించిన భూమిని డిజిటల్ పొజిషనింగ్ సిస్టమ్ సర్వే చేస్తున్నాం. మార్చిలో పనులు క్లోజ్ అయ్యే అవకాశం ఉండడంతో వేగంగా అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తాం. అటవీ శాఖకు కేటాయించిన భూమి మ్యూటేషన్ పనులు జరుగుతున్నాయి.
– భవానీ, ఆర్‌అండ్‌బీ డీఈ, రంపచోడవరం
గిరిగీసి.. ఆపేసి..
గిరిగీసి.. ఆపేసి..


