మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
అడ్డతీగల: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా సాగాలని ఐటీడీఏ పీఓ బచ్చు స్మరణ్‌రాజ్ అన్నారు. శుక్రవారం అడ్డతీగల వెలుగు కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఆదాయం సముపార్జించుకోవచ్చన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని సకాలంలో వాటిని తిరిగి చెల్లిస్తూ లాభాలు ఆర్జించాలన్నారు. సీ్త్రనిధి పథకం ద్వారా ఎంతమందికి ఉపయోగం కలిగిందో తెలుసుకున్నారు. స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలన్నారు.
ఫ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారాన్ని చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని పీఓ స్మరణ్‌రాజ్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన అంగన్‌వాడీ సిబ్బంది సమావేశంలో పీఓ పాల్గొని మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో మౌలిక వసతుల మెరుగుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం అడ్డతీగల సీహెచ్‌సీని సందర్శించారు. ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. వేటమామిడిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించి, అక్కడి నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. ఎంపీడీఓ ఏవీవీ కుమార్, వెలుగు ఏపీఎం అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


