అక్రమాల పుట్ట
అదనపు సేత్వార్లు అడ్డగోలుగా జారీ
పాత వాటిని మార్చి ఫోర్జరీ
అసలు హక్కుదారుల నామరూపాలు లేకుండా చేస్తూ..
పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు
మావల పరిధిలో జరిగిన మరో భూమాయ
సర్వే, భూ రికార్డులశాఖ తీరిది!
సాక్షి,ఆదిలాబాద్: సర్వే భూరికార్డుల శాఖలో అక్రమాల పుట్ట పగులుతోంది. అధికారం అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా అదనపు సేత్వార్లు (సప్లిమెంటరీ సేత్వార్) జారీ చేయడం, అసలు హక్కుదారుల వివరాలు నామరూపాలు లేకుండా చేయడంలో ఈ శాఖ సర్వేయర్లు, అధికారులు రియల్టర్లతో కలిసి నడిపిన అక్రమ భూ దందా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతేడాది అక్టోబర్‌లో జిల్లా కేంద్రంలోని 65 సర్వే నంబర్‌లో కోట్ల విలువైన 2.10 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారంలో సప్లిమెంటరీ సేత్వార్ జారీతోనే భూ అక్రమార్కులకు పని సులువైంది. ఈ వ్యవహారంపై బాధితులు జిల్లా పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేయడంతో బడా రియల్టర్లు, వ్యాపారులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఓ సర్వేయర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విధితమే. తాజాగా మావల పరిధిలో జరిగిన మరో ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది.
గతేడాదిలో..
గత అక్టోబర్‌లో 65 సర్వే నంబర్‌లో 2.10 ఎకరాల భూమాఫియాకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం కలిగించింది. ఈడీ ఆధీనంలో, ఎస్‌బీఐ మార్టిగేజ్‌లో ఉన్న భూమికి సంబంధించి రియల్టర్లు కుమ్ముకై ్క మొదట తహసీల్దార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఎలాగైనా ఈ భూమిని ఆక్రమించాలనే ఉద్దేశంతో సర్వే అధికారుల ద్వారా సప్లిమెంటరీ సేత్వార్ తీసుకున్నారు. ఇలా భూములకు సంబంధించి అసలు హక్కుదారుల వివరాలను నామరూపాలు లేకుండా చేసి అదనపు సేత్వార్ జారీ ద్వారా అక్రమార్కులకు రెవెన్యూ, సర్వే, భూరికార్డుల శాఖ అధికారులు వంతుపాడుతూ వస్తున్నారు. తద్వారా ఏళ్లుగా ఒకే దగ్గర పనిచేస్తున్న ఈ శాఖలోని ఉద్యోగుల్లో కొంత మంది కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలు లేకపోలేదు.
తాజాగా మావలలో..
మావలలో కోట్ల విలువైన 16 గుంటల భూమికి సంబంధించి జరిగిన భూమాఫియాపై బాధితులు 2018లో పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పట్లో కేసు నమోదు చేశారు. విచారణ ముందుకు సాగలేదు. తాజాగా ఆ బాధితులు మళ్లీ పోలీసులను ఆశ్రయించడం, జిల్లా పోలీసులు తిరిగి ఈ కేసుపై దృష్టి సారించడం సంచలనం కలిగిస్తోంది. మావల గ్రామ సర్వేనం.181/4లో అదనపు సేత్వార్ అక్రమంగా జారీ చేయడం, ఫోర్జరీ ఆరోపణలపై పోలీసులు మావల తహసీల్దార్‌ను కొన్ని వివరాలు ఇవ్వాలని వివరణ కోరడం సంచలనం కలిగిస్తుంది.
భూమిపై హక్కును హరించివేశారు..
మావలలో కోట్ల విలువైన ఈ భూమికి సంబంధించి ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఆ భూమికి సంబంధించి అదనపు సేత్వార్ జారీ విధానంపై వివరాలు కోరుతూ మావల తహసీల్దార్‌ను వాటిని పంపించాలని కోరడం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. సర్వే రికార్డులను మార్చివేసి కొంత మంది అధికారులతో కలిసి అక్రమంగా ఆ భూమిని పొందారని, తద్వారా ఆ భూమిపై తన హక్కును హరించారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇది ఓ భూమికి సంబంధించిన వ్యవహారమే అయినప్పటికీ జిల్లాలో రెవెన్యూ, సర్వే భూరికార్డుల శాఖల అధికారులు ఇటు రిజిస్ట్రేషన్, అటు అదనపు సేత్వార్లు జారీతో ఎలా అక్రమాలకు పాల్పడుతున్నారు.. అసలు హక్కుదారుల వివరాలను నామరూపాలు లేకుండా చేసి రియల్టర్లకు ఎలా వంతు పాడుతున్నారనేది తేటతెల్లం అవుతుంది.
అదనపు సేత్వార్ జారీ విధానంపై ఆరా..
అదనపు సేత్వార్ జారీలో జరుగుతున్న అక్రమాలపై పోలీసులు నిశితంగా దృష్టి సారించారు. ఈ సప్లిమెంటరీ సేత్వార్ జారీలో సర్వేయర్లు ఫీల్డ్ పరిశీలన నిర్వహించారా..? ప్రభావిత పట్టాదారులందరికి (పిటిషనర్‌తో సహా) నోటీసులు జారీ చేశారా..? అనే విషయాలపై స్పష్టతనివ్వాలని రెవెన్యూ అధికారులను పోలీసులు కోరడం జరిగింది. ఇదీ ఈ ఒక్క కేసు విషయంలోనే అనుకుంటే పొరపాటే. ఆదిలాబాద్ చుట్టుపక్కల అనేక భూములకు సంబంధించి సప్లిమెంటరీ సేత్వార్ల జారీలో జరిగిన అనేక మోసాలకు ఈ సేత్వార్ జారీ విధానంలో సర్వేయర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరించారా లేదా అనేది స్పష్టమవతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అధికారులేమన్నారంటే..


