ప్ర‘గతి’ రథానికి అవాంతరం
చింతూరు: పరిమితికి మించిన ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు నడపడంపై ప్రయాణికులు మండిపడ్డారు. కాగా ఘాట్ రోడ్డు ప్రయాణం తర్వాత ఆ బస్సు చింతూరు మండలం లక్కవరం వద్ద ముందు టైరు పంక్చర్ కావడంతో నిలిచిపోయింది. అదే ఘాట్ రోడ్డులో పంక్చర్ పడి ఉంటే తమ పరిస్థితి ఏంటంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ విరరాల్లోకి వెళ్తే.. గోకవరం డిపోనకు చెందిన రాజమహేంద్రవరం, భద్రాచలం బస్సు మధ్యాహ్నం 1.45 గంటలకు రాజమహేంద్రవరంలో బయలుదేరింది. రాజమహేంద్రవరం, కాకినాడ, గోకవరం, రంపచోడవరంలో చదువుకుంటున్న విలీన మండలాలకు చెందిన విద్యార్థులు సంక్రాంతి సెలవులు రావడంతో స్వగ్రామాలకు వచ్చేందుకు ఈ బస్సు ఎక్కారు. దీంతో ఇతర ప్రయాణికులు, విద్యార్థులతో బస్సు రాజమహేంద్రవరంలోనే పూర్తిగా నిండిపోగా గోకవరం, రంపచోడవరంలో మరింత మంది ఎక్కారు. 55 మంది సామర్థ్యం గల బస్సు ఇలా 143 మందితో మారేడుమిల్లి నుంచి బయలుదేరింది. బస్సు చింతూరు మండలం లక్కవరం వచ్చేసరికి టైరు పంక్ఛర్ పడింది. దీంతో ప్రయాణికులతో పాటు విద్యార్థులు గంటకు పైగా చలిలో రహదారిపై పడిగాపులు కాశారు. కొంతమంది సమీప గ్రామాలకు చెందిన విద్యార్థులు ఆటోలను కిరాయికి మాట్లాడుకుని అందులో వెళ్లిపోయారు. కాగా బస్సు నిలిచిపోయిన సమయంలో వీఆర్‌పురం మండలం శ్రీరామగిరికి చెందిన మాసిన పోశి అనే వ్యక్తి ఫిట్స్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులతో పాటు ప్రయాణికులు సపర్యలు చేయడంతో అతను కోలుకున్నాడు. పరిమితికి మించి ఘాట్ రోడ్డులో ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా అంతమందిని ఎక్కించుకోవడంపై తాము అభ్యంతరం తెలిపినా బస్సు సిబ్బంది పట్టించుకోలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులతో పాటు ప్రయాణికులు అధికంగా ఉంటారని తెలిసినా, అదనపు బస్సులు ఏర్పాటు చేయకుండా తమ ప్రాణాలతో చెలగాటమాడడం ఎంతవరకు సబబని వారు మండి పడుతున్నారు. గతనెల 12న ఇదే ఘాట్‌రోడ్డులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లోయలో బోల్తాపడిన ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. వారం క్రితం ఇదే సర్వీసు బస్సు ఘాట్ రోడ్డులోని దుర్గ గుడివద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో రేడియేటర్ దెబ్బతిని బస్సు తులసిపాక వద్ద నిలిచిపోయింది. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పండగల సమయంలో కూడా అధికారులు అదనపు బస్సులు వేయకపోవడం శోచనీయం.
ఫ పంక్చర్ పడి నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు
ఫ చలిలో అల్లాడిన
విద్యార్థులు, ప్రయాణికులు
ప్ర‘గతి’ రథానికి అవాంతరం
ప్ర‘గతి’ రథానికి అవాంతరం


