‘గోవిందగిరి’కి చేరిన తిరుమల లడ్డూలు
రంపచోడవరం: మండలంలోని ఐ.పోలవరం వద్ద గోవిందగిరి వేంకటేశ్వరస్వామి ఆలయానికి శుక్రవారం తిరుమల లడ్డూలు చేరుకున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ ఇ.రూప్‌సాయి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెయ్యి లడ్డూలు వచ్చాయన్నారు. ప్రతి నెలా రెండో శనివారం తిరుమల నుంచి పంపించిన లడ్డూలు అందుబాటులో ఉంటాయన్నారు. వీటిని నిబంధనల ప్రకారం భక్తులకు విక్రయిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పర్యాటక
అభివృద్ధికి చర్యలు
రంపచోడవరం: మండలంలోని భూపతిపాలెం ప్రాజెక్టు పరిధిలో పర్యాటక అభివృద్ధికి చర్యలు చర్యలు తీసుకుంటున్నట్లు రంపచోడవరం ఐటీడీఏ పీఓ బచ్చు స్మరణ్‌రాజ్ అన్నారు. స్థానికంగా పీఓ తన చాంబర్‌లో శుక్రవారం జిల్లా పర్యాటక అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓలు, వాటర్ స్పోర్ట్స్ సింగిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపతిపాలెం ప్రాజెక్టులో వాటర్ స్పోర్ట్స్ సింగిల్ ఇండియా ద్వారా సుమారు పది టూరిజం బోట్లు ఏర్పాటు చేసేందుకు అధికారులతో చర్చించారు. మూడు దశల్లో బోట్లకు చర్యలు తీసుకుంటామన్నారు. భూపతిపాలెం రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసే బోట్లకు ఏ ఏ రక్షణ చర్యలు తీసుకోవాలనే అంశాలపై అధికారులతో చర్చించారు. బోట్లు ప్రయాణించే పర్యాటకులకు ఎంతెంత బీమా చేయించాలనే విషయాలపై మాట్లాడారు. రిజర్వాయర్‌లో బోట్ల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకోవాలని, బోట్లు నడిపేందుకు ఎల్‌ఎంసీ ఈఈ, ఫిషరీస్ అధికారుల అనుమతులు తీసుకోవాలన్నారు. వారి నుంచి అభ్యంతరాలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ బాలాజీ, టూరిజం అధికారి జి.దాసు, వాటర్ స్పోర్ట్స్ ఇండియా మేనేజర్ కె.అశోక్, ఫణికుమార్, ఎంపీడీఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


