పనులు మరింత వేగవంతం చేయండి ˘
మోతుగూడెం: లోయర్ సీలేరు పొల్లూరు జల విద్యుత్ కేంద్రం వద్ద కొత్తగా నిర్మిస్తున్న ఐదారు యూనిట్ల పనులను ఏపీ జెన్‌కో హైడల్ డైరెక్టర్ సుజయ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. స్థానిక చీఫ్ ఇంజినీర్ రాజారావు పాటు ఇతర అధికారులతో కలసి యూనిట్ల అనుసంధాన పనులు చూశారు. ఈ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఐదో యూనిట్ సివిల్ పనులు సుమారు 90 శాతం, ఆరో యూనిట్ పనులు 40 శాతం వరకూ పూర్తయినట్లు తెలిపారు. సివిల్ పనులతో పాటు పెన్‌స్టాక్ అనుసంధాన పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ అనుసంధాన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలన్నారు. కీలకమైన ట్రయల్ రన్ రేస్ సంప్ అండర్ గ్రౌండ్‌లో ఐదారు యూనిట్లకు సంబంధించి గతంలో నీరు రాకుండా కాంక్రీటింగ్ వాల్వ్‌ను నిర్మించారు. ఇక్కడ జరుగుతున్న కాంక్రీట్ పనులపై ఆరా తీశారు. ఆయన రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి డొంకరాయి నుంచి పోర్‌బై వరకూ రూ.1.50 కోట్లతో జరుగుతున్న కాంక్రీటింగ్ పనులను పరిశీలించనున్నారు. దీంతో పాటు సీలేరు వద్ద వెయ్యి మెగావాట్లతో నిర్మిస్తున్న పంప్‌డ్ స్టోరేజ్ పవర్ హౌస్ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యలో అక్కడి సమస్యలపై స్థానిక జెన్‌కో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అనురాధ
అల్లవరం: అమలాపురం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యురాలు చింతా అనురాధ ఆ పార్టీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అనురాధ ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనపై విశ్వాసంతో ఈ బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటానని తెలిపారు. 2029లో వైఎస్సార్ సీపీ అధికారమే లక్ష్యంగా మహిళా శక్తిని సమీకరించి, పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తామని చెప్పారు. ఈ నియామకం తన బాధ్యతలను మరింత పెంచిందని, పార్టీ బలోపేతానికి అహర్నిశలూ కృషి చేస్తానని అనురాధ తెలిపారు. తనకు ఎల్లప్పుడూ ప్రోత్సహం అందిస్తున్న పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనురాధ నియామకంపై పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
కానుకలు వసూలు
చేయకుండా చర్యలు
అన్నవరం: సత్యదేవుని భక్తుల నుంచి అర్చకులు, వ్రత పురోహితులు బలవంతంగా కానుకలు వసూలు చేయకుండా చూడాలని అన్నవరం దేవస్థానం డిప్యూటీ కమిషనర్ బాబూరావు, అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవిని ఈఓ వేండ్ర త్రినాథరావు శుక్రవారం ఆదేశించారు. దీనికోసం సీసీ టీవీలను పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో అందిస్తున్న సేవలపై ప్రభుత్వం ప్రతి నెలా ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత నెల అన్నవరం దేవస్థానం నాలుగో స్థానంలో నిలిచింది. దీనిని మరింత మెరుగు పర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పనులు మరింత వేగవంతం చేయండి ˘


