
డెంగీతో విద్యార్థి మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్ ఏఎన్‌ఎంను విధుల నుంచి తొలగింపు
తిర్యాణి: డెంగీతో ఓ విద్యార్థి మృతి చెందాడు. తల్లిదండ్రులు, ఆర్‌బీఎస్‌కే వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పంగిడిమాదర పంచాయతీ పరిధి రాజాగూడ గ్రామానికి చెందిన ఆత్రం సీతారాం–దివ్యజ దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు ఆత్రం అనురాగ్ (12) స్థానిక ఆశ్రమ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. ఈనెల 14న అతడికి జర్వం రావడంతో పాఠశాల నుంచి ఇంటికి వెళ్లాడు. అదేరోజు సాయంత్రం తల్లిదండ్రులు మండల కేంద్రంలోని సీహెచ్‌సీలో చేర్పించారు. 15న వైద్య సిబ్బంది రక్త పరీక్షలు నిర్వహించగా వ్యాధి నిరార్ధణ కాలేదు. అయినప్పటికీ జర్వం తగ్గకపోవడంతో 18న రక్త పరీక్షలు నిర్వహించి తెల్లరక్త కణాలు తగ్గినట్లు గుర్తించారు. 19న మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీగా నిర్ధారించారు. ఈనెల 21న బాలుడి పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం రాత్రి మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీటీడీవో రమాదేవి, ఎంపీడీవో మల్లేశ్ పరామర్శించారు. కాగా, తిర్యాణి సీహెచ్‌సీలో వైద్య సిబ్బంది వ్యాధి నిర్ధారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి మూడు, నాలుగు రోజులు మామూలు వైద్యం అందించారని తల్లిదండ్రులు ఆరోపించారు. పరిస్థితి విషమించగా మంచిర్యాల ఆస్పత్రికి రిఫర్ చేశారని వాపోయారు. వైద్య సిబ్బంది సరైన చికిత్స అందించి ఉంటే తమ కొడుకు బతికేవాడని ఆవేదన వ్యక్తంజేశారు. కాగా, విద్యార్థికి జర్వం వస్తున్నా ఉన్నతాధికారులకు తెలుపకుండా నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రధానోపాధ్యా యుడు సాగర్‌ను సస్పెండ్ చేసినట్లు డీటీడీవో రమాదేవి తెలిపారు. అలాగే విధులను నిర్లక్ష్యం చేసిన ఏఎన్‌ఎం సువార్తను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పాఠశాల హెచ్‌ఎంగా సీనియర్ ఉపాధ్యాయుడు తిరుపతికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.