
‘బఫర్’ పరిధిలోని ఇళ్లకు నోటీసులివ్వాలి
కై లాస్‌నగర్: బఫర్ జోన్ పరిధిలో ఉన్న నివాసాలు, నాలాలపై ఉన్న నిర్మాణాలు గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులతో వరదనష్టంపై సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహించే సర్వే వివరాలను పవర్ పాయింట్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాలకు ఉప్పొంగి ప్రవహించిన ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్, కోజా కాలనీ, సుభాష్‌నగర్ లోలెవల్ బ్రిడ్జిలను హైలెవెల్ బ్రిడ్జిలుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఆర్‌ండ్‌బీ, మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. నాలాలపై ఉండే అక్రమ నిర్మాణాలు, ఇరుకుగా మార్చిన ప్రదేశాలను పరిశీలించి నివేదిక అందించాలన్నారు. సెప్టెంబర్ 10న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఇందులో ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ రాజు, ఇరిగేషన్ డీఈ విఠల్, తహసీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.