
‘సహకార’లో ఉత్కంఠ
పదవీకాలం పొడిగించినా.. కొనసాగింపుపై సందిగ్ధం
పనితీరు సక్రమంగా ఉంటేనే అనుమతి
నిబంధనలు విధించిన ప్రభుత్వం
సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లలో అసంతృప్తి
కై లాస్‌నగర్: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల గడువు ఈనెల 14వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో పద వీ కాలం మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిబంధనల ప్రకారం ఉన్న సొసైటీలకు మాత్రమే వర్తి స్తుందని మెలిక పెట్టింది. ఈ మేరకు పది అంశాలను నిర్దేశిస్తూ పనితీరు పరిశీలించనున్నట్లు స్పష్టం చేసింది. పదవీకాలం పొడిగింపుపై హర్షం వ్యక్తం చేసిన చైర్మన్లు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలతో ఢీలా పడిపోయారు. సర్కారు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం సొసైటీ ల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
అన్నదాతకు అండగా..
మండల స్థాయిలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు అందజేస్తూ సొసైటీలు వారికి అండగా నిలుస్తున్నాయి. ఇలాంటి వాటికి ప్రతీ ఐదేళ్లకోసారి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది. సొసైటీ పరిధిలోని రైతులు.. డైరెక్టర్లు, చైర్మన్లతో కూడిన పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. 2020లో ఎన్నికై న పాలకవర్గాల గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 14తో ముగిసింది. అయితే రాష్ట్రంలోని డీసీసీబీ చైర్మన్లంతా సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిసి విజ్ఞప్తి చేయడంతో పదవీకాలం ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ గడువు ఈ నెల 14తో ముగియడంతో మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మొదటిసారి ఎలాంటి నిబంధనలు లేకుండా పదవీ కాలం పొడిగించిన ప్రభుత్వం ఈసారి మాత్రం నిబంధనల ప్రకారం ఉన్న వాటికి మాత్రమే వర్తింపజేయాలనే నిబంధన విధించడంతో సొసైటీల కొనసాగింపు సందేహంగా మారింది.
పనితీరు మెరుగ్గా ఉంటేనే..
తాజా నిబంధనల ప్రకారం పనితీరు మెరుగ్గా ఉంటేనే వాటి పాలకవర్గాల గడువు పొడిగింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం సొసైటీల వారీగా పది అంశాలతో కూడిన సమాచా రం అందించాల్సిందిగా జిల్లా సహకార శాఖను ఆదేశించింది. సొసైటీ పరిధిలో పాత బకాయిల పరిస్థితి.. రుణాల తిరిగి చెల్లింపులు సక్రమంగా ఉన్నాయా, నిధుల దుర్వినియోగం ఏమైనా జరిగిందా.. జరిగితే వాటిపై ఎలాంటి విచారణ చేపట్టా రు.. దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా.. సొసైటీ కార్యకలాపాలపై ఆడిట్ చేశారా.. చట్టపరమైన చర్యలకు సంబంధించిన పిటిషన్ ఏదైనా పెండింగ్‌లో ఉందా.. అనే తదితర వివరాలతో కూడిన సమాచారం పంపించాలని సహకార శాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రంగంలోకి దిగిన ఆ శాఖ అధికారులు సొసైటీల వారీగా సమాచారం సేకరించారు. పనితీరును గుర్తించి వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. తదనుగుణంగా పొడిగింపు ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
పదవిపై ఉత్కంఠ..
ప్రభుత్వ తాజా నిబంధనలతో జిల్లాలో ఎంత మంది సొసైటీ చైర్మన్లకు పదవి గడువు పొడిగింపు దక్కుతుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తినెలకొంది. సర్కా రు నిర్ణయంపై పాలకవర్గాలతో పాటు వాటి పరిధి లోని రైతులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో..
మొత్తం సహకార సంఘాలు 28
డీసీసీబీ పరిధిలోనివి 23
ఎస్‌బీఐ పరిధిలోనివి 05
సభ్యత్వం కలిగిన రైతులు 30వేలు
నివేదిక అందజేశాం..
సహకార శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని సొసైటీల పనితీరుపై పది అంశాలతో కూడిన సమాచారం సేకరించాం. ఏ సొసైటీ పనితీరు ఏ విధంగా ఉందనే వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందించాం. తదుపరి ఆదేశాలకనుగుణంగా పొడిగింపుపై తగు చర్యలు తీసుకుంటాం.
– బి.మోహన్, జిల్లా సహకార అధికారి