
డుమ్మాలకు చెక్
లెక్చరర్లకూ ఎఫ్‌ఆర్‌ఎస్
ఇంటర్‌బోర్డు కసరత్తు
వారం రోజుల్లో అమలులోకి..
విద్యార్థులకు ఇప్పటికే మొదలైన ఫేషియల్ రికగ్నిషన్
ఆదిలాబాద్‌టౌన్: డుమ్మా లెక్చరర్లకు చెక్ పెట్టేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు చర్యలు చేపడుతోంది. చాలామంది సమయపాలన పాటించకుండా ఇష్టారీతిన విధులకు హాజరవుతున్నారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందడం లేదు. అయితే ఇప్పటికే పాఠశాలల్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్‌ఆర్‌ఎస్) విజయవంతం కావడంతో ప్రభుత్వ కళాశాలల్లోనూ అమలుకు చర్యలు చేపట్టింది. వారం రోజుల్లో అమలు చేయనున్నట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. కాగా శనివారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ఫేస్ రికగ్నిషన్ అమలులోకి తీసుకొచ్చారు. అయితే చాలాచోట్ల సర్కారు కాలేజీల్లో ప్రార్థన నిర్వహించకపోవడం, లెక్చరర్లు ఇష్టమున్నప్పుడు రావడం, వారికి నచ్చినప్పుడే వెళ్లడం పరిపాటిగా మారింది. ఇక నుంచి వారి ఆగడాలకు చెక్ పడనుంది. కళాశాలకు వచ్చిన లెక్చరర్లు బోధన చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇప్పటికే ప్రతీ తరగతి గది, కళాశాల ఆవరణ, ప్రిన్సిపాల్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని ఇంటర్ బోర్డుకు అనుసంధానం చేసిన విషయం తెలిసిందే.
జిల్లాలో..
దూరప్రాంతంలో ఉన్న కళాశాలల్లో పనిచేసే కొందరు ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు సమయపాలన పాటించడం లేదు. దీంతో విద్యార్థులకు సక్రమంగా తరగతులు నిర్వహించని పరిస్థితి. వీటిపై దృష్టి పెట్టిన ఇంటర్ బోర్డు టీజీబీఐఈఎఫ్‌ఆర్‌ఎస్ అమలుకు సన్నద్ధమవుతోంది. లెక్చరర్లు తమ సెల్‌ఫోన్లలోనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కళాశాల చుట్టూ వంద మీటర్ల దూరంలో ఇది పనిచేస్తుంది. ఉదయం 9.20 గంటలకు, సాయంత్రం 4 గంటలకు హాజరు వేయాల్సి ఉంటుంది. సమయపాలన పాటించని అధ్యాపకుల వేతనాల్లో కోత విధించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదివరకు లెక్చరర్లు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు ఉండేది. కోవిడ్ తర్వాత పలు కళాశాలల్లో ఆ యాంత్రాలు మూలనపడ్డాయి. అప్పటినుంచి హాజరు పట్టిక ద్వారానే అటెండెన్స్ నమోదు చేస్తున్నారు.
సొంత పనుల్లో బిజీ..
కొంత మంది లెక్చరర్లు కళాశాలల్లో పాఠాలు బోధించడం కంటే వారి సొంత పనుల్లోనే బిజీగా ఉంటున్నారనే విమర్శలున్నాయి. మారుమూల మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పర్యవేక్షించే వారు కరువవడంతో ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. కళాశాలకు ఆలస్యంగా రావడం, నిర్దేశిత సమయం ముగియక ముందే ఇంటి ముఖం పట్టడం చేస్తున్నారు. పాఠాలు సక్రమంగా బోధించని లెక్చరర్లు మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. అయితే ఇంటర్‌లో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులైన వారు, డిగ్రీలో కనీసం పాస్ కాకపోవడం గమనార్హం.