
● ఇళ్ల నిర్మాణాలపై యంత్రాంగం దృష్టి ● పనులు ప్రారంభించక
కెలాస్‌నగర్: పేదల సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని చేపట్టింది. తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి మంజూరు చేస్తుంది. అయితే ప్రొసీడింగ్ అందుకున్న చాలా మంది నెలలు గడుస్తున్నా పనులు షురూ చేయడం లేదు. అలాంటి వారిపై యంత్రాంగం దృష్టి సారించింది. నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచిస్తుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రారంభించకుంటే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేస్తోంది. అలాగే వారి స్థానంలో అర్హులైన వారికి మంజూరు చేయాలని భావిస్తోంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొదటి, రెండు విడతల్లో కలిపి 9,093 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో ఇప్పటి వరకు 2024 ఇళ్ల పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పనులు ప్రారంభించకుంటే అవి రద్దయ్యే అవకాశముంది. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఏడాది జనవరి 26న మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలే అత్యధికంగా ప్రారంభానికి నోచుకోవడం గమనార్హం. నిర్మాణాలకు అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోవడం, సామగ్రి ధరలు పెరగడం, ఎస్‌హెచ్‌జీల నుంచి సకాలంలో రుణాలు మంజూరు కాకపోవడం వంటి కారణాలతో పలువురు ఇళ్ల నిర్మాణాలకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. రెండో విడతదీ అదే పరిస్థితి. దీంతో నిర్మాణాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ప్రొసీడింగ్ అందుకుని 45 రోజుల్లోగా నిర్మాణాలు ప్రారంభించకుంటే ఆ ఇళ్లను రద్దు చేయాలని యంత్రాంగం భావిస్తోంది. ఉద్దేశపూర్వకంగా నిర్మాణం చేపట్టనటువంటి వారి ఇళ్లను రద్దు చేసి వారి స్థానంలో మరొకరికి మంజూరు చేయాలని నిర్ణయించింది. తొలుత వారికి నోటీసులు జారీ చేసి ఇళ్లను రద్దు చేస్తారు. అయితే పూరి గుడిసెల్లో నివసించేవారు, అత్యంత పేదలకు ఈ నిర్ణయం నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు.
కలెక్టర్ ప్రత్యేక దృష్టి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులతో ఇటీవల సమీక్షించిన ఆయన వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికీ పనులు ప్రారంభించని వారికి నోటీసులు జారీ చేసి, 45 రోజుల్లోగా షురూ చేయకుంటే వాటిని రద్దు చేయాలని ఆదేశించారు. అలాగే ఇళ్ల మంజూరు పేరిట ఎవరైనా వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపించాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. తద్వారా పారదర్శకత ఏర్పడి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కలెక్టర్ తాజా నిర్ణయాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి ఏ మేరకు పుంజుకుంటుందనేది వేచి చూడాల్సిందే.
హస్నాపూర్‌లో మంగళవారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ రాజర్షి షా
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం తీరిది..
మంజూరైనవి : 9,093
మార్కవుట్ ఇచ్చినవి : 7,069
బెస్‌మెంట్ వరకు చేరినవి : 2,959
రూప్ లెవల్‌కు చేరినవి : 255
రూప్ పూర్తయినవి : 90
నిర్మాణాల వేగవంతంపై దృష్టి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగవంతంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పనులు ప్రారంభించకుంటే వారి స్థానంలో మరొకరికి ఇంటిని మంజూరు చేస్తాం. అయితే వారిని ఎల్–1 స్టేజ్‌లో పెడుతాం. మళ్లీ ఆసక్తి చూపితే మంజూరు చేస్తాం. పేదలకు మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది. ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఎవరైనా వసూళ్లకు పాల్పడినట్లు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
– జి.జితేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో