
పాసైంది నలుగురే..!
● పరీక్ష రాసింది 129 మంది ● విడుదలైన లైసెన్స్‌డ్ సర్వేయర్ ఫలితాలు ● ఫెయిలైనా అప్రెంటిస్‌షిప్ యథాతథం
కై లాస్‌నగర్: లైసెన్స్‌డ్ సర్వేయర్ల పరీక్ష ఫలితాలను హైదరాబాద్‌కు చెందిన జేఎన్‌టీయూ బుధవారం ప్రకటించింది. జిల్లాలో 155 మంది సర్వేయర్ శిక్షణ పొందారు. వారికి గత నెల 26, 27, 28 తేదీల్లో పరీక్షలు నిర్వహించగా 129 మంది హాజరయ్యారు. ఇందులో కేవలం నలుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గుడిహత్నూర్‌కు చెందిన జాదవ్ కిర్తీ (71, 63,77)మార్కులు సాధించగా, ఆదిలాబాద్‌కు చెందిన రంగసాయి కిరణ్ (65,77,73), ఇంద్రవెల్లికి చెందిన మేస్రం రాజు (66, 76, 83), తలమడుగుకు చెందిన తమ్మల సాయిప్రీతం(61,64,82)మార్కులను సాధించి ఉత్తీర్ణులయ్యారు. మిగతా 125 మంది ఫెయిలయ్యారు. ప్రాక్టికల్స్‌లో అందరూ ఉత్తీర్ణులైనప్పటికీ థియరీ, ప్లాటింగ్ పరీక్షల్లో రాణించలేకపోయారు. ఫలితాలను అభ్యర్థుల వాట్సాప్ నంబర్లకు పంపించారు. అయితే ఈ నెల 6నుంచి అందిస్తున్న అప్రెంటిస్‌షిప్ యథాతధంగా కొనసాగుతుందని జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్ తెలిపారు. ఫెయిలైన వారికి వచ్చే నెల 13, 14 తేదీల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈమేరకు షెడ్యూల్‌ను తెలంగాణ అకా డమీ ఫర్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ జా యింట్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అందులో ఉత్తీర్ణులయ్యే వారిని కొనసాగించే అవకాశమున్నట్లుగా ఆయన వెల్లడించారు. కాగా పరీక్షల తీరుపై అభ్యర్థులు ఇది వరకే ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి నిర్వహించాలంటూ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వారు భా వించినట్లుగానే ఫలితాల్లో కేవలం నలుగురే ఉత్తీర్ణులు కావడం గమనార్హం. అయితే గతంలో జరిగిన పొరపాట్లకు అవకాశం లేకుండా ఈ సారి పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు.