
మళ్లీ పొడిగింపేనా?
● ఫిబ్రవరిలో ఆరు నెలలు పెంచిన ప్రభుత్వం ● నేటితో ముగియనున్న సొసైటీ పాలకవర్గాల గడువు ● జాతీయ పతాకావిష్కరణపై చైర్మన్ల ధీమా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వివరాలు
కై లాస్‌నగర్/నిర్మల్‌చైన్‌గేట్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువు ఈ నెల 14న ముగియనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీటి గడువు ముగిసినప్పటికీ డీసీసీబీ చైర్మన్ల విజ్ఞప్తి మేరకు ఆరునెలల పాటు అదనంగా పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు సైతం గురువారంతో ముగియనుంది. ప్రస్తుతం వీటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో సొసైటీ పాలకవర్గాల గడువు పెంపు మరోసారి అనివార్యం కానుంది. ప్రత్యేకాధికారులను కూడా నియమించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. పంద్రాగస్టు వేడుకల్లో తామే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తామని సొసైటీ చైర్మన్లు ధీమా వ్యక్తం చేస్తుండటంతో పాలకవర్గాల గడువు మరోసారి పొడిగింపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రెండోసారి పదవీకాలం పొడిగింపు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)కు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహించింది. సొసైటీ పరిధిలో ఎన్నికై న చైర్మన్‌లతో అదే నెల 25న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు ఎన్నికలు నిర్వహించారు. వీరితో పాటు పలువురు డైరెక్టర్లను సైతం ఎన్నుకున్నారు. కాగా ఈ సొసైటీలకు ఎన్నికలు జరిగి ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీతో ఐదేళ్ల గడువు పూర్తయ్యింది. దీంతో వాటి కాలపరిమితి ముగియడంతో రాష్ట్రంలోని డీసీసీబీ చైర్మన్లంతా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ పదవీకాలాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఆరునెలల పాటు పదవీకాలాన్ని పొడిగించింది. తాజాగా ఈ గడువు నేటితో ముగియనుంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో మరోసారి తమ పదవీకాలాన్ని పొడిగించాలని డీసీసీబీ చైర్మన్లతో పాటు సొసైటీ చైర్మన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో మరోసారి మూడు లేదా అరునెలల పాటు పదవీకాలం పొడిగిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదవీ కాలం ముగియడంతో 15వ తేదీన జరిగే పంద్రాగస్టు వేడుకల్లో చైర్మన్ల హోదాలో జాతీయ పతాకావిష్కరణ చేసే అవకాశం ఉండదు. అయితే ప్రభుత్వం ఎలాగైనా తమ పదవీకాలాన్ని పొడిగిస్తుందనే ధీమాలో ఉన్న సొసైటీ చైర్మన్లు తామే మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
సహకార సంఘాలు : 77
డీసీసీబీ : 01
డీసీఎంఎస్ : 01
సొసైటీల పరిధిలోని సభ్యులు : 55 వేలు
అన్నదాతకు వెన్నుదన్నుగా ...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 55 వేలకు పైగా రైతులు ఉన్నారు. వారికి వ్యవసాయ సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట రుణాలను క్షేత్రస్థాయిలో అందజేస్తూ సొసైటీలు వారికి అండగా నిలుస్తున్నాయి. పలు సొసైటీలు ధాన్యం కొనుగోళ్లను సైతం చేపడుతున్నాయి. ఈ సొసైటీలన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ), జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ (డీసీఎంఎస్) ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి.
అవకాశముంది
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువు ఈ నెల 14తో ముగియనుంది. ఇటీవలే ఆరు నెలల పాటు సొసైటీల గడువును ప్రభుత్వం పొడిగించింది. మరోసారి సైతం పదవీకాలాన్ని పొడిగించేందుకే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది. – బి.మోహన్,
జిల్లా సహకార శాఖ అధికారి, ఆదిలాబాద్