
అక్రమ లేఅవుట్లలో హద్దురాళ్ల తొలగింపు
కైలాస్‌నగర్: జిల్లాకేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లేఅవుట్ల ఏర్పాటుతో పాటు అనుమతులు లేకుండా ప్లాట్లను విక్రయిస్తూ రియల్లర్లు సొమ్ము చేసుకుంటున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు న్నాయి. అయితే కలెక్టర్ రాజర్షి షా విషయాన్ని గుర్తించి చర్యలకు ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణంలోని బంగారుగూడ సమీపంలో రియల్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండా రెండు లేఅవుట్లను ఏర్పాటు చేశారు. ప్రజలను ఆకర్షించేలా రంగురంగుల జెండాలను పాతారు. అధికారి క పర్యటనలో భాగంగా ఆ మార్గంలో పయనించిన కలెక్టర్ విషయాన్ని గమనించారు. వాటిపై చర్యలకు ఆదేశించారు. వెంటనే మేల్కొన్న టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. పొక్లెయిన్‌తో లేఅవుట్లలో పాతిన హద్దురాళ్లు, జెండాలను తొలగింపజేశారు. కాగా, ఈ చర్యల విషయాన్ని బయటకు రానీయకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు గోప్యత పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.