
యూట్యూబర్ పేరిట మోసం
కౌటాల: యూట్యూబ్ స్టార్ హర్షసాయి అనుచరుడని ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడిన మొహమ్మద్ తౌఫిక్‌ఖాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు కౌటాల సీఐ సంతోష్‌కుమార్ తెలిపారు. సోమవారం సర్కిల్ కార్యాలయంలో కేసు వివరాలు వె ల్లడించారు. హర్యానాలోని మేవార్ జిల్లా లోహికాకాల గ్రామానికి చెందిన మొహమ్మద్ తౌపిక్ ఖాన్ అదే రాష్ట్రానికి చెందిన సహచరులు ముబారక్ ఖాన్, వసీమ్‌ఖాన్, అహ్మద్ ఖాన్, ఇమ్రాన్‌లతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. యూట్యూబర్ హర్షసాయి పేరుతో నకిలీ నంబర్లు, వాట్సాప్ వాడుతూ ప్రజలకు ఆర్థికసాయం, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఫోన్ పే, ఇతర ఆన్‌లైన్ మధ్యమాల ద్వారా డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. గత మేలో జిల్లాలోని బెజ్జూర్ మండలం సలుగుపల్లి గ్రామానికి చెందిన ఆత్రం సాయిని నమ్మించి రూ. 28వేలు వసూలు చేశారు. అనంతరం అతని ఫోన్ నంబర్ కలవకపోవడంతో మోసపోయానని గుర్తించి సాయి బెజ్జూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు పై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని హర్యానాలో పట్టుకున్నారు. మిగితా నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందుతుడి వద్ద నుంచి సెల్‌ఫోన్, సిమ్‌లు, ఆన్‌లైన్ లావాదేవిల రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో శ్రమించిన ఎస్సైలు సర్తజ్‌పాషా, తేజస్విని, కానిస్టేబుల్ వినోద్, సందీప్‌ను సీఐ అభినందించారు.