
‘సంక్షేమ’ తిప్పలు!
● ప్రభుత్వ పథకాల కోసం పాత మండలాలకే.. ● కొత్త మండలాల్లో అందుబాటులోకి రాని సేవలు ● జిల్లాలోని 46 గ్రామాల ప్రజలకు అవస్థలు
కై లాస్‌నగర్: తెల్లరేషన్ కార్డు కలిగిన నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరిట సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మహాలక్ష్మి పథకం ద్వారా ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగిన వారికి రూ.500కే సిలిండర్, 200 యూని ట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి గృహజ్యోతి కింద ఉచిత కరెంట్ అందిస్తోంది. ఈ పథకాలకు అర్హులైనప్పటికీ రేషన్‌కార్డులు లేకపోవడంతో జిల్లాలో చాలామంది పేదలు ఇన్ని రోజులు సంక్షేమ లబ్ధికి దూరమయ్యారు. ప్రభుత్వం ఇటీవల కొత్త కార్డులు జారీ చేయడంతో వీరికి అవకాశం లభించింది. దీంతో కార్డులు పొందిన వారు తమ మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాలను ఆశ్రయించి వివరాలు నమోదు చేయించుకుంటున్నారు. అయితే కొత్తగా ఏర్పడ్డ మండలాల్లో మాత్రం ఈ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఎంపీడీవో కార్యాలయాలు, అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ ఆయా పథకాల లబ్ధి కోసం పాత మండలానికే పయనమవ్వాల్సిన పరిస్థితి. దీంతో పేదలకు వ్యయ, ప్రయాసలు తప్పడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
మూడు మండలాల్లో ఇదే పరిస్థితి..
జిల్లాలో ఇటీవల సాత్నాల, భోరజ్, సొనాల మండలాలు కొత్తగా ఏర్పడిన విషయం విదితమే. సొనాల మండలంలో 12 గ్రామాలు ఉండగా, సాత్నాలలో 17, భోరజ్‌లో 17 గ్రామాలు కలిపి మూడు మండలాల పరిధిలో 46 గ్రామాలు ఉన్నాయి. ఈ మండలాల్లో ప్రభుత్వ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయా గ్రామాల్లోని కొత్తగా రేషన్ కార్డులు కలిగిన అర్హులైన వారంతా తిరిగి తమ పాత మండలాలకు వెళ్లాల్సి వస్తోంది. సాత్నాల మండల వాసులు ఆదిలాబాద్ రూరల్, బేల, జైనథ్‌కు వెళ్లాల్సి రాగా.. భోరజ్ మండల వాసులు జైనథ్‌కు, సొనాల మండలవాసులు బోథ్ మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. అయితే కొత్త మండలాల్లో ఎంపీడీవోలు, ఉద్యోగులు, సిబ్బంది ఉన్నప్పటికీ ప్రజాపాలన కేంద్రాల నిర్వహణకు అవసరమైన లాగిన్లను ప్రభుత్వం ఇంకా కేటాయించలేదు. దీంతో అక్కడ దరఖాస్తులను స్వీకరించే అవకాశం లేకుండా పోయింది.
గతంలో దరఖాస్తు చేసుకున్న వారికే ...
ప్రభుత్వం గతంలో నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికే రాయితీ పథకాలను ప్రభుత్వం వర్తింపజేస్తోంది. కొత్తగా రేషన్‌కార్డులు పొందిన వారు ప్రజాపాలన రశీదుతో పాటు ఉచిత విద్యుత్ కోసమైతే విద్యుత్ బిల్లు, కుటుంబీకుల ఆధార్ జిరాక్స్ ప్రతులను అందజేయాల్సి ఉంటుంది. అలాగే రూ.500 సిలిండర్ పథకం కోసమైతే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో ఈకేవైసీ నమోదు చేసుకుని ఉండాలి. వీటి కోసం ప్రస్తుతం ఆయా మండలాల వాసులకు తిప్పలు తప్పడం లేదు.
ప్రభుత్వానికి పంపించాం
కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లాగిన్లు కేటాయించినప్పటికీ ప్రజాపాలన కేంద్రాల లాగిన్లను ఇంకా ఇవ్వలేదు. వాటి కోసం ప్రభుత్వానికి సీజీజీ ద్వారా ప్రతిపాదనలు పంపించాం. వాటిని కేటాయించేలా ఫాలోఅప్ చేస్తున్నాం. త్వరలోనే ఆయా మండలాలకు లాగిన్లు కేటాయించే అవకాశముంది. అప్పటి వరకు అర్హులైన వారికి పాత మండలాల్లోనే ఆయా సేవలను అందిస్తున్నాం.
– జి.జితేందర్ రెడ్డి, జెడ్పీసీఈవో