
ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని ఒకరి మృతి
భైంసారూరల్: భైంసా–నిర్మల్ జాతీయ రహదారి మాటేగాం సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ద్విచక్రవాహనంతో ఢీకొని యశ్వంత్ (21) అనే యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పేండ్‌పెల్లి గ్రామానికి చెందిన యశ్వంత్, కుంసర గ్రామానికి చెందిన విలాస్ శుక్రవారం భైంసాకు వచ్చారు. పనులు ముగించుకుని భైంసా నుంచి ద్విచక్రవాహనంపై పేండ్‌పెల్లికి వెళ్తున్నారు. మాటేగాం గ్రామ సమీపంలో రోడ్డుపై ట్రాక్టర్ ట్రాలీ ఫంక్షర్ కావడంతో అక్కడే నిలిపి ఉంచారు. రోడ్డుపై ఉన్న ట్రాలీని వీరు ద్విచక్రవాహనంతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయాలపాలైన క్షతగాత్రులను 108లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా పేండ్‌పెల్లికి చెందిన యశ్వంత్ మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కుభీర్: మండలంలోని పార్డి (బీ) గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగశివుని తండాకు చెందిన పవార్ సచిన్ అనే యువకుడు మృతి చెందాడు. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సచిన్ తన బైక్‌పై సాయంత్రం కుభీర్ సంతకు వస్తుండగా పార్డి(బీ) సమీపంలో పంది తగిలి క్రిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం అతడిని భైంసాకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. అతడి భార్య సిమ్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతోపాటు కూతురు, తల్లితండ్రులు ఉన్నారు.
గడ్డి మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య
భైంసారూరల్: మండలంలోని బడ్‌గాం గ్రామానికి చెందిన షానే మరీబా (84) అనే వృద్ధుడు గడ్డి మందు తాగి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. షానే మరీబా భార్య ఏడాది క్రితం మృతి చెందింది. అప్పటినుంచి కుమారుడి వద్ద ఉంటున్నాడు. ఒంటరి తనం భరించలేక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే భైంసా ఏరియాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడు పరమేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అప్పుల బాధతో మహిళ..
కాసిపేట: మండలంలోని దేవాపూర్ ప్రసన్నాంజనేయనగర్‌కు చెందిన గంగాధరి వాణి(44) అనే మహిళ అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల క్రితం దేవాపూర్‌కు చెందిన శంకర్‌తో వాణి వివాహం జరిగింది. కొంతకాలంగా శంకర్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో వాణి టైలరింగ్ పని చేస్తూ ఇంటి భారాన్ని మోసింది. తనకు వచ్చే డబ్బులు సరిపోకపోవడం, అప్పులు ఉండడంతో మనోవేదనకు గురై ఈనెల 6న మధ్యాహ్నం పురుగుల మందు తాగింది. గమనించిన భర్త వెంటనే గ్రామంలోని కంపెనీ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. పరిస్థితి విషమించగా కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తుండగా రాత్రి మృతిచెందింది. మృతురాలికి 11 ఏళ్ల కొడుకు విజ్ఞతేజ్ ఉన్నాడు. మృతురాలి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని ఒకరి మృతి