
పోడు కోసం పోరు
తాండూర్: దశాబ్దాలుగా పోడు భూములు సాగుచేసుకుంటున్న తమకు వాటిపై హక్కులు కల్పించాలని రైతులు పోరుబాట పట్టారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన సుమారు 40మంది రైతులు మూడురోజుల క్రితం చేపట్టిన పాదయాత్ర గురువారం రాత్రి తాండూర్‌కు చేరుకుంది. మండలంలోని రేపల్లెవాడ సమీపంలోని శ్రీరామ జిన్నింగ్ మిల్లులో సేద తీరిన అనంతరం శుక్రవారం తెల్లవారుజామున రైతులు తమ పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా గ్రామ శివారులోని సుమారు 1,200 ఎకరాలను సాగు చేసుకుంటూ 600 కుటుంబాలవాళ్లం జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది అటవీశాఖ అధికారులు వాటిని సాగు చేసుకోకుండా అడ్డుకున్నారని వాపోయారు. తమకు న్యాయం చేసి భూ హక్కు పత్రాలు ఇచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి, అధికారులకు తమ గోడు చెప్పుకొంటామని వారు పేర్కొన్నారు.