ట్రాఫిక్ క్లియర్
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధానచౌక్‌ల్లో దశాబ్దకాలంగా ఉన్న ట్రాఫిక్ సమస్య ఎ ట్టకేలకు తొలగింది. అంబేడ్కర్‌చౌక్, గాంధీచౌక్, దేవిచంద్‌చౌక్, శివాజీచౌక్‌ల్లోని ఫుట్‌పాత్‌లు, డివైడర్లు, రోడ్లను ఆనుకుని ఉన్న ఆక్రమణలను అధి కారులు మంగళవారం తొలగించారు. ఇది వరకే వారికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించిన అధికారులు ప్రధాన చౌక్‌ల నుంచి వెళ్లిపోవాలంటూ పలుమార్లు నోటీసులు సైతం జారీచేశారు. అయినా వారు స్పందించకుండా అక్కడే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లన్నీ రద్దీగా మారి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిన పరిస్థితి. ఒక వాహనం వెళితే మరో వాహనం వెళ్లలేని దుస్థితి. దీంతో పాదాచారులు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధి కారులు పొక్లెయిన్ల సాయంతో ఆక్రమణలన్నీ తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ చర్యలపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది.
ప్రత్యేక బలగాల నడుమ
కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 8గంటల సమయంలో ప్రత్యేక పోలీసు బలగాల నడుమ ము న్సిపల్, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆయా చౌక్‌ల్లోని డివైడర్లు, టేలాలు, షెడ్లను పూర్తిగా తొలగింపజేశారు. కొంతమంది వ్యాపారులు స్వచ్ఛందంగా వాటిని తొలగించుకోగా, మరికొందరు వీధి వ్యాపారులు, మైనార్టీ నాయకులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొనగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి వన్‌టౌన్‌కు తరలించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు చెందిన మైనార్టీ నాయకులను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ అఖిల్ మహాజ న్, ఏఎస్పీ కాజల్, డీఎస్పీ జీవన్‌రెడ్డి భద్రతను పర్యవేక్షించారు. ఆర్డీవో వినోద్‌కుమార్, మున్సి పల్ కమిషనర్ సీవీఎన్. రాజు ఆధ్వర్యంలో ఈ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగింది. ఆయా చౌక్‌ల్లోని సుమారు 201 ఆక్రమణలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆక్రమణల తొలగింపు అనంతరం రోడ్లు విశాలంగా మారాయి. వాహనదారులు ఇబ్బందులు లేకుండా వెళ్లే అవకాశం కలిగింది.
ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపు
ప్రధాన చౌక్‌ల్లో తొలగించిన వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా జిల్లా కేంద్రంలోని గణేశ్ థియేటర్ స్థలం కేటాయించారు. 208 మంది వ్యాపారులకు గత నెలలో లక్కీ డ్రా నిర్వహించి స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఐదు వరుసలుగా స్థలాలను ఎంపిక చేశారు. మరో వైపు తొలగించిన ఆక్రమణదారుల్లో 101 మంది తొలిరోజే గణేశ్ థియేటర్ స్థలానికి చేరుకుని దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు ప్రా రంభించారు. మున్సిపల్ కమిషనర్ రాజు, టీపీవో సుమలత, టీపీబీవో సాయికృష్ణ, టీపీఎస్ నవీన్ కుమార్ సాయంత్రం వరకు అక్కడే ఉండి వ్యాపారులకు స్థలాల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షించారు.
మళ్లీ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు..
ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో తిరిగి ఎవరైనా టేలాలు, తోపుడుబండ్లు, షెడ్లను ఏర్పాటు చేసినట్లైతే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్‌లు హెచ్చరించారు. పట్టణంలోని ప్రధాన చౌక్‌లతో పాటు రోడ్ల వెంబడి కొత్తగా ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
పట్టణంలోని ప్రధానచౌక్‌ల్లో ఆక్రమణల తొలగింపు
పలువురి ముందస్తు అరెస్ట్
ప్రత్యామ్నాయంగా స్థల కేటాయింపు
ట్రాఫిక్ క్లియర్


