విహారయాత్రకు వెళ్లి తిరిగిరాని లోకాలకు
కాగజ్‌నగర్‌రూరల్: విహారయాత్రకు వెళ్లిన యువకుడు నీట మునిగి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని విలేజ్ నెం 1కు చెందిన మంజిత్ మండల్(35)ఆదివారం గ్రామానికి చెందిన కొంతమందితో కలిసి విహార యాత్ర కోసం జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు వద్దకు వెళ్లాడు. అక్కడ విందు చేసుకున్న అనంతరం మృతుడు చేపలు పట్టేందుకు వలతో నీటిలోకి దిగాడు. లోతు ఎక్కువ ఉండడంతో వలలో చిక్కుకుని గల్లంతయ్యాడు. రాత్రి వరకు గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం గజ ఈతగాళ్లతో వెతికించడంతో మృతదేహాన్ని వెలికి తీశారు. కూలీ పని చేసుకుని జీవనం సాగించే మంజిత్ మండల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని సోదరుడు సుజిత్ మండల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


