కేస్లాపూర్ చేరిన ప్రచార రథం
ఇంద్రవెల్లి: పుష్యమాస అమావాస్యను పుష్కరించుకుని జనవరి 18న నాగోబా ఆలయంలో నిర్వహించే మహాపూజతో పాటు జాతర నిర్వహణపై ఈ నెల 23న కేస్లాపూర్‌లోని నాగోబా మురాడి నుంచి ప్రారంభమైన మెస్రం వంశీయుల ప్రచార కార్యక్రమం సోమవారం ముగిసింది. మండల కేంద్రంలోని గోండ్‌గూడలో మెస్రం వంశీయులు ఎడ్లబండికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయంత్రం ప్రచారరథం కేస్లాపూర్ గ్రామానికి చేరుకోగా వారి ఆచారం ప్రకారం రాత్రి మడావి వంశీయుల ఇంట్లో బస చేశారు. మంగళవారం ఉదయం నాగోబా మురాడికి చేరుకుని మధ్యాహ్నం ఉమ్మడి జిల్లా మెస్రం వంశీయులతో సమావేశమై పవిత్రమైన గంగా జల సేకరణ పాదయాత్రను ప్రారంభించనున్నట్లు నాగోబా ఆలయ పిఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్ తెలిపారు. ఈ ప్రచార ముగింపు కార్యక్రమంలో కటోడ మెస్రం హనుమంత్‌రావ్, మెస్రం కోసేరావ్, దేవ్‌రావ్, పర్ధాన్ మెస్రం దాదారావ్, తదితరులు పాల్గొన్నారు.


